మ‌రో వివాదంలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ!

Update: 2022-08-23 04:07 GMT
కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ వివాదంలో చిక్కుకున్నారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో అక్ర‌మ మైనింగ్‌కు ఆయ‌న స‌హ‌కారం అందించార‌నే పిటిష‌న్‌లో హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్య‌వ‌హారంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, గ‌నుల శాక అధికారుల‌కు నోటీసులు ఇచ్చింది.

అదేవిధంగా వ్యాపారులు... అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె. శేషుకుమార్‌, బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ ఈవో, కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరంద‌రినీ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది.

త‌దుప‌రి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.  ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ స‌హ‌కారంతో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురు అక్ర‌మ మైనింగ్‌కు పాల్పడుతున్నార‌ని హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్) దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే.  

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో బ్రహ్మలింగయ్య చెరువు పరిసరాల్లో జరుపుతున్న గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ను నిలువరించాలని గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్‌ పిల్‌ వేశారు. అంతేకాకుండా గతంలో బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్న చోటే  విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేసేలా ఆదేశించాలని ఆయ‌న త‌న పిల్‌లో కోరారు.

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహ‌న్‌ సహకారంతో అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె. శేషుకుమార్‌ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని పిటిష‌న‌ర్ ర‌వికుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. వారి నుంచి సీనరేజ్‌ రుసుము వసూలు చేయాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నవారికి జరిమానా విధించాలని కోర్టును విన్న‌వించారు. మైనింగ్‌ కార్యకలాపాల నిమిత్తం చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లను నరికేశారని తెలిపారు. అంద‌రి వాద‌న‌లు విన్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం విచార‌ణ‌ను ఎనిమిది వారాలు వాయిదా వేసింది.
Tags:    

Similar News