మళ్లీ గంట కొట్టే టైమొచ్చింది

Update: 2020-03-18 01:30 GMT
విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరతారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావుకు కష్టకాలం నడుస్తోంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో సైకిల్‌ కు పంక్చర్‌ కావడం ఆయనకు కాస్త కూడా గిట్టుబాటు కాలేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికారాన్ని, పదవిని తన దగ్గరే ఉంచుకుంటారని గంటాకు పేరుంది. టీడీపీ అధికారానికి దూరం కావడంతో, ఎన్నికల తర్వాత నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన వైసీపీలో చేరతారన్న మాట వినిపించినప్పుడల్లా.... తాను పసుపు జెండాను విడిచి పెట్టేది లేదని కచ్చితంగా చెప్పారు. మరో వైపు, జగన్‌ జట్టులో చేరేందుకు రెడీ అంటూ సిగ్నల్సూ కూడా పంపారు. అయితే అప్పుడు అధికార పార్టీ సరిగా పట్టించుకోలేదు. దీంతో గంటా కూడా ఈ మధ్య సైలెంటయ్యారు. ఇప్పుడు లోకల్‌ బాడీ ఎలక్షన్ల కారణంగా వైసీపీనే ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక లాగా సాగాలంటే గంటా అండ ఉండాలని వైసీపీ భావిస్తోంది. అందుకే గంటాకు రిటర్న్‌ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించింది.

వైసీపీలో చేరేందుకు గంటా సిద్ధమేనని తెలుస్తున్నా, ఆ గట్టుకు వెళ్లాలంటే పదవిని ఏటిలోనే వదిలేయాలన్న కండిషన్‌ ఆయనకు మింగుడు పడటం లేదు. అయితే, ప్రకాశం జిల్లా నేత కరణం బలరాం గంటాకో రూటు చూపించారు. పార్టీలో చేరకపోయినా చేరినట్లు ఎలా ఉండాలో ప్రాక్టికల్‌గా నిరూపించారు. ఆ రూటా గంటాకూడా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖకే చెందిన మంత్రి అవంతి మాత్రం గంటా రాకను గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు.
Tags:    

Similar News