అడకత్తెరలో మంత్రి గంటా!

Update: 2018-07-18 07:33 GMT
చంద్రబాబు కేబినెట్ లో ఏ మంత్రికీ రాని కష్టాలు గంటా శ్రీనివాసరావుకు వస్తున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ఆయన సామాజికవర్గ నేపథ్యం - గతంలో ఆయన రాజకీయంగా వేసిన అడుగులు వంటి వన్నీ ఆయన ప్రతిరోజూ శీలపరీక్షలో నెగ్గాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి.
   
గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ఊపందుకున్నప్పటికీ ఆయన మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడం - చిరంజీవికి సన్నిహితుడు కావడం ఆయన్ను ఇప్పుడు చంద్రబాబు అనుమానించే పరిస్థితులను కల్పించాయి. గతంలో ఆయన చిరంజీవి కుటుంబానికి చెందిన కథనాయకుల సినిమాల కార్యక్రమాల సమయంలో సహకరించడం వంటివి జరిగాయి. దాంతో ఆయన పవన్ కల్యాణ్ జనసేన వైపు వెళ్లే అవకాశముందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే అదే ప్రచారం జరుగుతుండడం.. చంద్రబాబు కూబా ప్రయారిటీ తగ్గించడంతో గంటా ఇప్పడు పవన్ ను విమర్శిస్తూ చంద్రబాబు వద్ద సచ్ఛీలత నిరూపించకునే ప్రయత్నం చేస్తున్నారు.
   
ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పవన్ కు 25 ప్రశ్నలు సంధించారు. తాజాగా మరోసారి ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు.  పవన్ మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఏదో చేయడానికి అన్నీ వదిలేసుకుని వచ్చానని పదేపదే చెబుతున్న పవన్ మాటలు ఉత్తవేనని అన్నారు. రైల్వే జోన్ కోసం టీడీపీ విశాఖలో దీక్ష చేస్తున్న సమయంలోనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని నిలదీశారు.
   
అయితే.. పవన్‌ ను విమర్శిస్తుండడాన్ని ఆయన సొంత సామాజికవర్గం నేతలు కానీ - చిరు అభిమానులు కానీ ఇష్టపడడం లేదట. దీంతో అటు పార్టీ అధినేతను మెప్పించడం - చిరు కుటుంబానికి చెందిన పవన్‌ ను విమర్శించడం మధ్య గంటా తెగ ఇబ్బంది పడుతున్నారట.


Tags:    

Similar News