కోవిషీల్డ్ డోసుల‌ వ్య‌త్యాసంపై మెజార్టీ అభిప్రాయ‌మే నిజ‌మైంది .. ఏం జరిగిందంటే ?

Update: 2021-06-17 06:30 GMT
కరోనా మహమ్మారి కట్టడి లో వేగంగా పనిచేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌హారంరోజురోజుకి ముదిరిపోతోంది. కోవిషీల్డ్ తోలి డోస్‌ కు, రెండో డోస్‌ కు మ‌ధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే, అంత బాగా ప‌ని చేస్తుందంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఓ వాదనను తెరపైకి తీసుకువచ్చింది. వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిలో అల‌స‌త్వాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకే కేంద్ర ప్ర‌భుత్వం డోస్‌ ల మ‌ధ్య తేడా నాట‌కానికి తెర‌లేపింద‌ని  విమ‌ర్శ‌లు వస్తున్నాయి. అయితే తాజాగా రెండు డోసుల‌ వ్య‌త్యాసంపై మెజార్టీ అభిప్రాయ‌మే నిజ‌మైంది. కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మ‌ధ్య తేడా రెట్టింపు చేయాల‌ని తాము సూచించ‌లేద‌ని , కేంద్రం  నియ‌మించిన శాస్త్రీయ బృందంలోని ముగ్గురు నిపుణులు తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకీ ఆ ముగ్గురు నిపుణులు ఎవరు అంటే... ఎన్‌ టాగీ స్టాండింగ్‌ టెక్నికల్‌ సబ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎండీ గుప్తే, డాక్టర్‌ మాథ్యూ వర్ఘీస్‌, డాక్టర్‌ జేపీ ములియిల్‌. వీరిలో ములియిల్‌ కరోనా వర్కింగ్‌ గ్రూపు సభ్యుడు కూడా కావ‌డం గ‌మ‌నార్హం. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ‌చ్చిన కొత్తలో తోలి డోసుకు, రెండో డోసుకు మ‌ధ్య గ్యాప్ 4 నుంచి 6 వారాలుగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ త‌ర్వాత ఆ తేడా ఒక్క‌సారిగా మూడింత‌లు ఎక్కువగా చేయడం తో అందరూ షాక్ కి గురైయ్యారు. కోవిషీల్డ్ మొద‌టి, రెండో డోసుల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని 12 నుంచి 16 వారాల‌కు పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త నెల 13న ఓ సంచలన ప్ర‌క‌ట‌న చేసింది. బ్రిటన్ అధ్యయనాల ఆధారంగా ‘జాతీయ సాంకేతిక పరిజ్ఞాన సలహా బృందం (ఎన్‌ టాగీ)’ చేసిన సూచనల మేరకే డోసుల మధ్య తేడాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

దీనితో అప్పటికే తోలి డోసు వేపించుకొని , రెండో  డోసు వేయించుకోవాల‌ని స‌న్న‌ద్ధ‌మ వుతున్న వారు కొంచెం అయోమ‌యానికి గుర‌య్యారు.  మ‌రోవైపు కోవిషీల్డ్ దొర‌క‌ని ప‌రిస్థితి. దేశంలో డిమాండ్‌ కు త‌గ్గ‌ట్టు టీకా ల‌భ్యం కాక‌పోవ‌డం వ‌ల్లే కేంద్ర‌ప్ర‌భుత్వం అమాంతం తేడా పెంచింద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో ఎక్కువగా వినిపించాయి. తాజాగా ఆ  ముగ్గురు నిపుణుల ప్ర‌క‌ట‌న‌తో అదే నిజ‌మైంద‌ని దేశ వ్యాప్తంగా దీని గురించి పెద్ద చర్చ జరుగుతోందట. ఈ నేప‌థ్యంలో ఎన్‌ టాగీలోని కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ అధిపతి ఎన్‌ కే అరోడా స్పందిస్తూ మే 10 నుంచి 13 నడుమ జరి గిన ఎన్‌ టాగీ సమావేశాల్లో కొవిషీల్డ్‌ డోసుల మధ్య తేడా పెంపు నిర్ణయంపై గుప్తే, వర్ఘీస్‌, ములియిల్‌ ఎలాంటి అసమ్మతీ తెలియజేయలేదని తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు, ఏకాభిప్రాయంతోనే డోసుల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తాజా విమ‌ర్శ‌ల‌ను కొట్టి పారేయ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News