‘‘ఆదానీ’’లు అడిగినా బాబు రియాక్ట్ కాలేదా?

Update: 2016-06-25 11:50 GMT
వాన్ పిక్ ప్రాజెక్ట్ పేరు చెప్పిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తుకు రాక మానదు. ఈ ప్రాజెక్టు కోసం వేలాది ఏకరాల్ని సేకరించటం.. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్న ఆరోపణలతోపాటు.. ఒక ప్రాజెక్ట్ కోసం వేలాది ఎకరాలు ప్రభుత్వం ఎలా ఇస్తుందన్న విమర్శలు వెల్లువెత్తటం లాంటివి ఒకటి తర్వాత  ఒకటిగా గుర్తుకు రాక మానదు. వాన్ పిక్ అంటే చాలు.. వైఎస్ మానసపుత్రికగా పలువురు అభివర్ణిస్తారు.

అలాంటి ఆ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తనదైన చర్యలు తీసుకున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ప్రాజెక్టు కింద కేటాయించిన భూముల్ని చంద్రబాబు సర్కారు వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం గందరగోళంలో పడటమే కాదు.. దాని భవితవ్యం  మీద పలు సందేహాలు వ్యక్తమైన పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు గుజరాత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదానీ ఆసక్తి ప్రదర్శిస్తున్న విషయం చర్చకు వచ్చింది.

ఈ ప్రాజెక్టు విషయంలో గౌతం ఆదానీ ప్రతినిధులు ఏపీ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ను సంప్రదించిన విషయాన్ని ఆయన మంత్రి వర్గంలో చర్చకు పెట్టారు. వాన్ పిక్ ఓడరేవులు తాము చేపడతామని వారు చెప్పినట్లుగా చెప్పగా.. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయి.. ఈ ప్రాజెక్టు విషయంలో ఆదానీలు తనను సంప్రదించిన విషయాన్ని బయట పెట్టటం ఆసక్తికరంగా మారింది.

వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టేందుకు గౌతం ఆదానీ సిద్ధంగా ఉండటమే కాదు.. వారి ప్రతినిధులు చంద్రబాబును కలిసినప్పుడు.. ఈ వ్యవహారాల్ని చూస్తున్న వారిని కలవాల్సిందిగా తాను సూచించిన విషయాన్ని ఆయన చెప్పుకు రావటం గమనార్హం. ఆ తర్వాత ఏమైందో తనకూ తెలీదన్న మాట బాబు నోటి నుంచి రావటం కాస్త ఆశ్చర్యకరమైన అంశంగా చెప్పాలి.

ఎందుకంటే..  ఏదైనా ప్రాజెక్టు విషయం మీద ఏపీ చంద్రబాబును కలిస్తే.. ఆయనకు ఆయనే చొరవ తీసుకోవటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా వాన్ పిక్ విషయంలో తానే మాత్రం కల్పించుకోకపోవటమే కాదు.. దాన్ని చూస్తున్న అధికారుల్ని సంప్రదించాలని మాట వరసకు చెప్పిన తీరు చూస్తే.. ఈ ఇష్యూలో కలగజేసుకుంటే లేని తలనొప్పులు ఖాయమని ఆయన భావిస్తున్నారా? అన్న సందేహం కలగకమానదు. ఇప్పటికే ఆదానీలకున్న పేరుప్రఖ్యాతులు ఎలాంటివో తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి విషయంలో తొందరపాటుకు గురి కాకుండా ఆచితూచి అడుగులు వేయాలన్న ఆలోచనతోనే.. బాబు ఈ తరహాలో వ్యవహరించి ఉంటారన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News