క‌మ‌ల‌నాథుడిగా మార‌నున్న క్రికెట‌ర్?

Update: 2018-08-20 16:46 GMT
క్రీడా రంగం - సినీ రంగం - రాజ‌కీయ రంగం.... ఈ మూడింటికీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇప్ప‌టికే సినీరంగానికి చెందిన ఎంజీఆర్ - క‌రుణానిధి - జ‌య‌ల‌లిత‌ - ఎన్టీఆర్ వంటి ప‌లువురు న‌టీన‌టులు సీఎంల స్థాయికి వెళ్లిన దాఖ‌లాలున్నాయి. ఇక క్రీడా రంగం నుంచి వ‌చ్చిన అజ‌రుద్దీన్ - సిద్ధూ మంత్రులుగా పనిచేయగా....దాయాది దేశ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ప్ర‌ధాని అయ్యాడు. ఇక ఇదే కోవ‌లో టీమిండియా క్రికెట‌ర్ ఒక‌రు చేర‌బోతున్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. ఢిల్లీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్....త్వ‌ర‌లో బీజేపీలో చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 2019 ఎన్నిక‌ల‌ల్లో ఢిల్లీ నుంచి గౌతీని బ‌రిలోకి దింపాల‌ని బీజేపీ అధిష్టానం స‌న్నాహాలు చేస్తోంద‌ని టాక్ వ‌స్తోంది. కొద్ది రోజులుగా గౌతీ ...టీమిండియాకు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. 

గంభీర్ కు జాతీయ భావాలు - దేశభక్తి ఎక్కువన్న సంగ‌తి తెలిసిందే. భార‌త సైనికులపై ఉగ్ర‌దాడుల గురించి గౌత‌మ్ గ‌తంలో ఘాటుగా వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్ధిక సాయం చేయ‌డం వంటివి కూడా గౌతీ చేశాడు. ఈ నేప‌థ్యంలోనే గంభీర్ కు బీజేపీ ఎర వేస్తోంద‌ని టాక్. ఢిల్లీ నుంచి అత‌డిని బ‌రిలోకి దింపాల‌ని యోచిస్తోంద‌ట‌. రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌ని గౌత‌మ్...టీమ్ లో చోటు ద‌క్కించుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. దీంతో, పొలిటిషియ‌న్ గా కొత్త అవ‌తార‌మెత్తాల‌ని గౌతీ కూడా యోచిస్తున్నాడ‌ట‌. గంభీర్ ఇప్ప‌టికి 58 టెస్టులు - 147 వన్డేలు ఆడాడు. 2011 వరల్డ్‌ కప్ ఫైనల్ లో గౌత‌మ్ 97 పరుగులు చేసి విజయంలో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News