దేశ ఆర్థిక ప్రగతిపై మనోళ్లవన్నీ అర్భాటాలేనా?

Update: 2019-06-11 18:11 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా దేశం అభివృద్ధి ఆశించినంతగా లేదట. ఇదేదో మోదీ అంటే గిట్టని నేతలో - విపక్షంలో ఉన్న నేతలో చెబుతున్న మాట కాదు. మోదీ ఏరికోరి మరి తన ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమించుకున్న ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద సుబ్రహ్మణ్యం చెప్పిన మాట. ఎన్డీఏ- 1 సర్కారులో ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్... నాడు ఈ విషయంపై అసలు నోరే విప్పలేదు. తీరా ఆ పదవి నుంచి తప్పుకుని తనకు ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిష్ఠాత్మక వర్సిటీ హార్వర్డ్ వర్సిటీకి అందజేసి ఓ నివేదికలో ఆయన ఈ విషయాన్ని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిపోయిందని చెప్పాలి. అయినా ఈ పరిశోధనా పత్రంలో అరవింద్ ఏమని చెప్పారన్న విషయానికి వస్తే... యూపీఏ హయాంలోని 2011-12 - ఎన్డీఏ హయాంలోని 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో దేశ జీడీపీ 7 శాతంగా ఉందని అటు యూపీఏ సర్కారుతో పాటు ఇటు ఎన్డీఏ సర్కారు కూడా గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు ఏడాదుల్లో దేశ జీడీపీ 4.5 శాతమేనని అరవింద్ తెలిపారు.

తన హాయంలో ఉత్పత్తి రంగాన్ని పరుగులు పెట్టిస్తానని - దాని కోసమే మేకిన్ ఇండియా నినాదాన్ని మోదీ భుజానికెత్తుకోగా... అదే రంగంలో ప్రగతి మందగించిన కారణంగానే జీడీపీ అంచనాలు అందుకోలేకపోయిందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మోదీ గొప్పలపై ఇప్పటికే విపక్షాలు తమదైన రీతిలతో సెటైర్లు వేస్తున్నాయి. వాపును చూసి దానినే బలుపుగా చెప్పుకుంటూ మోదీ సాగుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా మోదీ ఏరికోరి మరీ నియమించుకున్న అరవింద్ తాజాగా చేసిన కామెంట్లు సంచలనం రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి.
Tags:    

Similar News