పాక్ గీత.. ఖమ్మం రాణి నేనా?

Update: 2015-08-10 05:01 GMT
చిన్నతనంలో తప్పిపోయి పాక్ కు చేరిన ‘గీత’కు సంబంధించి మరో కుటుంబం ఆమె.. తమ బిడ్డే నని చెబుతోంది. బాలీవుడ్ చిత్రం భజరంగీ బాయిజాన్ తరహాలో మాటలు రాని పాక్ చిన్నారి పొరపాటున భారత్ లోకి  ప్రవేశించటం.. ఆమెను హీరో పాక్ కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించటం తెలిసిందే.

ఈ చిత్రంలో మాదిరే.. భారత్ కు చెందిన ఒక చిన్నారి  చిన్నతనంలో భారత్ నుంచి పాక్ కు వెళ్లటం.. అప్పటి నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న ఆమె ఉదంతం మరోసారి తెర మీదకు రావటం.. దీంతో కేంద్ర సర్కారు జోక్యం చేసుకొని గీత ను భారత్ కు తీసుకురావాలన్న ప్రయత్నాలు షురూ చేసింది.

ఈ నేపథ్యంలో బీహార్.. జార్ఖండ్.. పంజాబ్.. ఒడిశా రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు గీత తమ బిడ్డే నని చెబుతున్న సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కుటుంబం గీత తమ బిడ్డగా చెబుతోంది. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య.. గోపమ్మ దంపతులకు నలుగురు కుమార్తె లు. 2006 జనవరిలో గుంటూరు జిల్లాకు వెళ్లిన సమయంలో తమ కుమార్తె తప్పిపోయిందని.. అప్పటి నుంచి పదేళ్లు వెతికినా  తను కనిపించలేదని చెబుతున్నారు.

చిన్నతనంలో తప్పిపోయిన చిన్నారికి.. ఇప్పుడు పాక్ లోని గీతకు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. తను తమ రాణినే అంటూ వీరి తల్లిదండ్రులు చెబుతున్నారు. రాణిని తమను చూస్తే గుర్తు పట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ కుమార్తె ను తమకు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. మరి.. పాక్ గీత.. ఖమ్మం రాణి అవుతుందా? లేదా? అన్నది ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తేలిపోవటం ఖాయం.
Tags:    

Similar News