ఘర్ వాపసీ: కాంగ్రెస్ కు తిరిగి వచ్చిన 17 మంది సీనియర్లు

Update: 2023-01-07 04:42 GMT
ఏళ్లకు ఏళ్లు అలవాటైన పార్టీని వదిలేసి.. సొంతంగా ఏదో చేస్తామని అననుకోవటం అత్యాశే అవుతుంది. ఈ విషయంలో ఇప్పటి తరం నేతలకు కాస్తంత మినహాయింపు ఇవ్వొచ్చు. కానీ.. వయసుడిగిపోయి.. దశాబ్దాల పర్యంతం కాంగ్రెస్ లో నలిగిన నేతలకు బయటకు వెళ్లటం అంటే.. నీటిలో ఉన్న చేపను నేల మీదకు పడేసినట్లే. ఈ విషయాన్ని కాస్తంత ఆలస్యంగా అర్థం చేసుకున్నారు పదిహేడు మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఆ మధ్యన అధినాయకత్వం మీద కోపంతో కశ్మీరీ నేత గులాంనబీ అజాద్ తో కలిసి పదిహేడు మంది బయటకు వెళ్లిపోయిన వారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

బయటకు వెళ్లిన సీనియర్లకు కాంగ్రెస్సే దిక్కైంది. తాజాగా దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సీనియర్లు సొంతగూటికి చేరుకున్నారు. కశ్మీర్ కు చెందిన ఈ పదిహేడు మంది పార్టీలోకి తిరిగి రావటంతో ఆ పార్టీలో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మరో రెండు వారాల సమయంలో పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్ లోకి ఎంట్రీ ఇస్తున్న వేళ.. పార్టీని వదిలేసి వెళ్లిన 17 మంది సీనియర్లు పార్టీలోకి తిరిగిరావటంతో.. వారంతా రెట్టించిన ఉత్సాహంతో రాహుల్ జోడోయాత్ర విజయవంతానికి ప్రయత్నిస్తారని చెబుతున్నారు.

రెండు నెలల క్రితం కాంగ్రెస్ ను వదిలేసి వెళ్లిన ఈ సీనియర్లు.. గులాం నబీ అజాద్ స్థాపించిన కొత్త పార్టీలో చేరారు. అయితే.. తమకు ప్రత్యేకంగా ఎలాంటి విలువను ఇవ్వటం లేదని.. ఆయన్ను నమ్మి తాము మోసపోయినట్లుగా వారు వాపోతున్నారు. వీరు చేసిన వ్యాఖ్యలతో సీరియస్ అయిన గులాం నబీ అజాద్ వారిలో కొందరిపై సస్పెన్షన్ వేట వేశారు. దీంతో.. వారు సమాలోచనలు జరిపి.. తిరిగి కాంగ్రెస్ లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పార్టీలోకి ఘర్ వాపసీ అనటం చూస్తే.. రానున్న రోజుల్లో గులాం నబీ అజాద్ సైతం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కొందరికి కొన్ని అంశాలు అలవాట్లుగా మారతాయి. కోపంతోనో.. ఆవేశంతోనో.. అసంత్రప్తితోనో నిర్ణయాలు తీసుకుంటారు కానీ.. చివరకు తాము కన్వినీయంట్ గా ఉండేదేమిటన్నది కాలం పుణ్యమా అని తమకు ఎదురయ్యే అనుభవాలతో అర్థం చేసుకుంటారు. తాజాగా కాంగ్రెస్ లోకి ఘర్ వాపసీ అయిన పదిహేడు మంది సీనియర్ నేతలు కూడా ఆ కోవలొకి చెందిన వారేనని చెప్పకతప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News