బెంగ‌ళూరులో వాలిపోయిన కాంగ్రెస్ టాస్క్ మాస్ట‌ర్స్!

Update: 2018-05-15 02:32 GMT
గ‌తంలో ఎన్న‌డూ లేనంత హుషారుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా క‌ర్ణాట‌క‌లో అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి మోడీ అండ్ కో సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో.. అంత‌కు మించిన అలెర్ట్ గా ఉంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒక‌ప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా త‌మ పార్టీనే అధికారంలో ఉండే ప‌రిస్థితి నుంచి ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి దిగజారిపోయిన దుస్థితి. క‌ర్ణాట‌క‌లో ప‌వ‌ర్ చేజార్చుకుంటే కాంగ్రెస్ కు జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో చోటు చేసుకున్న త‌ప్పులు పున‌రావృతం కాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు అత్య‌ధిక సీట్లు సాధించినా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం రాలేదు. ఈ సంద‌ర్భంగా పొత్తుల గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండా కాల‌యాప‌న చేసింది.

దీన్నో అవ‌కాశంగా మార్చుకున్న బీజేపీ ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి ప‌రిస్థితి క‌ర్ణాట‌క‌లో ఎదురుకాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఉంది. అందుకే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టానికి ముందే పార్టీ ముఖ్య‌నేత‌ల్ని బెంగ‌ళూరుకు పంపింది. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న గులాం న‌బీ అజాద్ తో పాటు అశోక్ గెహ్లాట్‌ ను సోమ‌వారం సాయంత్రానికే బెంగ‌ళూరుకు పంపింది.

క‌ర్ణాట‌క ఫ‌లితం హంగ్ అయిన ప‌క్షంలో..  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా.. దాన్ని పొగొట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇందుకోసం ముంద‌స్తుగానే కొన్ని ఫార్ములాల‌ను రెఢీ చేసింది.భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ ప్రిపేర్ చేసే దిశ‌గా కాంగ్రెస్ త‌న ప్ర‌య‌త్నాల్ని మొద‌లు పెట్టింది. అయితే.. ఇదంతా హంగ్ ఏర్ప‌డితే మాత్ర‌మే.
Tags:    

Similar News