పాక్ ఉగ్ర‌వాదం..నోట్ల ర‌ద్దు సేమ్ టు సేమ్‌

Update: 2016-11-17 13:40 GMT
రూ.500 - రూ.1000 నోట్ల ర‌ద్దు అంశంపై చ‌ర్చ ముదిరి పాకాన ప‌డుతోంది. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా రాజ్య‌స‌భలో ఈ అంశంపై చ‌ర్చ గంద‌ర‌గోళానికి దారి తీసింది. ప్ర‌తిప‌క్ష నేత గులామ్ న‌బీ ఆజాద్ మాట్ల‌డుతూ యూరీలో పాక్ ఉగ్ర‌వాదుల వ‌ల్ల మ‌ర‌ణించిన వారికంటే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నోట్ల రద్దు వ‌ల్ల మ‌ర‌ణాలు ఎక్కువ‌య్యాయ‌ని ఆజాద్ ఘాటుగా ఆరోపణ‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌భ‌కు వ‌చ్చేంత వ‌ర‌కు నోట్ల ర‌ద్దు అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌రాద‌ని ఆజాద్ డిమాండ్ చేశారు.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య‌నాయుడు ప్ర‌తిప‌క్ష నేత ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ను పాక్ ఉగ్ర‌వాదంతో పోల్చ‌డాన్ని వెంక‌య్య‌నాయుడు వ్య‌తిరేకించారు. ప్ర‌తిప‌క్ష నేత దేశాన్ని అవ‌మానించార‌ని విమ‌ర్శించారు. దీంతో స‌భ‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. అరుపులు - కేక‌ల‌తో స‌భ దద్ద‌రిల్లింది. పాకిస్థాన్‌ లో పెళ్లిలు - శుభ‌కార్యాల‌కు మీరు వెళ్తార‌ని - వాళ్ల‌కు రెడ్ కార్పెట్ కూడా వేస్తార‌ని, అలాంటి మీరు మ‌మ్మ‌ల్ని విమ‌ర్శిస్తారా అని కేంద్ర మంత్రి వెంక‌య్య వ్యాఖ్య‌ల‌కు ఆజాద్ స్పందించారు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలిగించాలని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కోరారు. ఆజాద్‌ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. అయితే స‌భ‌ను దారిలోకి తెచ్చేందుకు డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్ ప్ర‌య‌త్నించారు. స‌భ‌ నినాదాల‌తో మారుమోగింది. దాంతో కురియ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.

ఇదిలాఉండ‌గా ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో ప్ర‌స్తుతానికైతే కొత్త‌వి ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టంచేశారు. నోట్ల ర‌ద్దు అంశంపై ఆయ‌న క్లారిటీ ఇస్తూ దేశ‌వ్యాప్తంగా గురువారం 22500 ఏటీఎంల‌ను కొత్త నోట్ల‌కు అనుగుణంగా మార్పు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.నిధుల దుర్వినియోగానికి అడ్డుక‌ట్ట వేయ‌డానికే రోజువారీ ప‌రిమితిని రూ.4500 నుంచి రెండు వేల‌కు త‌గ్గించిన‌ట్లు జైట్లీ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News