కాంగ్రెస్ చీలిపోతుందా.. గులాం పెద్ద ప్లాన్‌!

Update: 2022-03-12 05:33 GMT
పంజాబ్‌లో ఓట‌మితో కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌మ‌ర్థ నాయ‌క‌త్వ‌మే పార్టీ ప‌రాజ‌యానికి కార‌ణ‌మంటూ సొంత పార్టీ నేత‌లే బ‌హిరంగంగా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే పంజాబ్ చేజారడంతో భ‌విష్య‌త్‌పై భ‌యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి మ‌రో షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఆ పార్టీలోని సీనియ‌ర్ల బృందం తాజాగా స‌మావేశం కావ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

వాళ్ల భేటీతో..

కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగ‌త‌, నాయ‌క‌త్వ మార్పును బ‌లంగా కోరుకుంటున్న 23 మంది సీనియ‌ర్ నేతలు మ‌రోసారి హైక‌మాండ్‌పై మండిప‌డ్డారు. జీ-23 బృందంగా మారిన ఈ నాయ‌కులు శుక్ర‌వారం ఢిల్లీలోని మాజీ ఎంపీ గులామ్ న‌బీ అజాద్ నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవ‌ల వెలువ‌డ్డ అయిదు రాష్ట్రాల ఫ‌లితాల్లో కాంగ్రెస్ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పంజాబ్‌లో అధికారంలో ఉండి కూడా ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అక్క‌డి పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో అధినాయ‌క‌త్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌డుతున్నారు.

ఓట‌మి బాధ్య‌త ఎవ‌రిది?

అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఈ జీ-23 నేత‌లు స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీ ఎంపీలు ఆనంద్ శ‌ర్మ‌, క‌పిల్ సిబాల్‌, మ‌నీశ్ తివారీ త‌దిత‌ర నేత‌లు స‌మావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పనితీరుతో పాటు త‌మ భ‌విష్య‌త్ వ్యూహంపై వీళ్లు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల్లో పార్టీ ప‌నితీరును స‌మీక్షించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త్వ‌ర‌లోనే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించాల‌ని వీళ్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓట‌మికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. పార్టీ కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఏం చేస్తారో?

సోనియా గాంధీ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించే కంటే ముందు ఈ జీ-23 నేత‌లు భేటీ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే పార్టీలో చీలిక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సీనియ‌ర్ నేత‌లంద‌రితో పాటు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే నాయ‌కుల‌తో క‌లిపి గులాం న‌బి అజాద్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న‌తో పాటు ఈ సీనియ‌ర్ నేత‌లు అధిష్టానంతో అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో చీలిక త‌ప్ప‌దేమో చూడాలి.
Tags:    

Similar News