కుక్క కోసం కాబోయే భ‌ర్త‌ను వ‌దులుకుంది!

Update: 2016-09-14 05:38 GMT
అమ్మాయి - అబ్బాయిల మ‌ధ్య అభిప్రాయ భేదాలు వ‌చ్చి ఆగిపోయిన పెళ్లిళ్ల గురించి విన్నాం! అభిరుచులు క‌ల‌వ‌క క్యాన్సిలైన క‌ల్యాణాలు చూశాం. అంతేగానీ, ఒక కుక్క వ‌ల్ల పీట‌ల దాకా వ‌చ్చిన పెళ్లి పెటాకులు కావ‌డం గురించి ఎక్క‌డా విన‌లేదు క‌దా! కానీ, బెంగుళూరులో ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. అంతేకాదు, ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వాట్సాప్ మెస్సేజులు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి!

బెంగ‌ళూరుకు చెందిన క‌రిష్మా వాలియాకు ఎప్ప‌టి నుంచో కుక్క‌లంటే ఇష్టం. ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటోంది. ఈ మ‌ధ్య‌నే రిష్తా అనే వ్య‌క్తితో క‌రిష్మాకి పెళ్లి కుదిరింది. త్వ‌ర‌లోనే అంగ‌రంగ వైభోగంగా పెళ్లి చేసుకుందాం అని కూడా నిర్ణ‌యించుకున్నారు. కాబోయే భార్యాభ‌ర్త‌లు కాబ‌ట్టి, స‌ర‌దాగా వాట్సాప్ చాటింగులూ మీటింగులూ పెట్టుకునేవారు. ఓసారి ఈ ఇద్ద‌రి మ‌ధ్యా కుక్క‌కు సంబంధించిన టాపిక్ చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాట్సాప్ లో అదే విష‌యం కాబోయే భ‌ర్త‌కు చెప్పింది. అత‌డికి కుక్క అంటే అస్స‌లు గిట్ట‌దు! ‘పెళ్లయిన తరువాత కుక్కును నాతో తీసుకొస్తా’ అని కరిష్మా మెసేజ్ పెట్టింది. దాంతో అతగాడికి చిర్రెత్తింది. ‘నాకు కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండ‌దు. అమ్మ‌కు ఇంకా కోపం. అయినా, నా ల‌వ్ లైఫ్‌లోకి కుక్క‌ల‌కు నో ఎంట్రీ. నా బెడ్ మీద కుక్కకు ప్లేస్ ఇవ్వ‌డం అసాధ్యం’ అని కాస్త సీరియ‌స్‌గానే చెప్పాడు. అయినా, కుక్క‌తో రిలేష‌న్ ఎక్కువ రోజులు ఉండ‌దు క‌దా అని కన్వెన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

క‌రిష్మాకు కోపం వ‌చ్చింది. పెళ్లి కోసం పెంపుడు కుక్క‌ను వ‌దులుకోలేననీ, పెళ్లి త‌రువాత కుక్క వ‌ల్ల స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని చెప్పంది. దాంతో రిష్తాకి మండి... ‘అదే నీ నిర్ణయం అయితే నాదో సలహా... హాయిగా ఆ కుక్క‌నే పెళ్లి చేసుకో’ అని స‌మాధానం ఇచ్చాడు. అంతే, అక్క‌డితో పెళ్లి పెటాకులు అయిపోయింది. ఒక కుక్క కోసం ఇలా సంబంధాలు చెడ‌గొట్టుకుంటారా..! కుక్క కోసం ఈ ఇద్ద‌రూ వాట్సాప్ లో పెట్టుకున్న గొడ‌వ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ కుక్క వాద‌న పెళ్లికి ముందే జ‌రిగింది, ఇదేదో పెళ్లి త‌రువాత అయితే ప‌రువు పోయేద‌ని రెండు కుటుంబాల పెద్ద‌లూ కాస్త ఊపిరి పీల్చుకుని ఉంటారు.
Tags:    

Similar News