జగన్ దగ్గరకు వెళ్ళు...మా దగ్గరకు ఎందుకు....ఎమ్మెల్యేలు!

Update: 2022-09-14 07:32 GMT
వైసీపీలో కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చిపడ్డాయిరా నాయనా అనుకోవాల్సి వస్తోంది. ఇప్పటికి మూడున్నరేళ్ల పుణ్య కాలం ఇట్టే గడచిపోయింది. అదే సమయంలో జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకున్న వారు ఎవరూ లేరు. దాంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం అనే అంటున్నారు. అయితే ఏ సమస్య అయినా చెప్పుకుందామనో లేక సాయం కోసమే తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తే వారు అక్కడ అంటున్న మాటలు చెబుతున్న సలహాలూ చిత్రంగా ఉన్నాయని అంటున్నారు.

మా దగ్గరకు ఎందుకు వచ్చారు. మీరు మమ్మల్ని చూసి ఓటు వేయలేదు కదా కాబట్టి మీకు ఏమైనా కావాల్సి వస్తే కనుక నేరుగా జగన్ దగ్గరకే వెళ్ళంది అని ఉచితమైన సలహాలు ఇస్తున్నారుట. రావాలి జగన్ కావాలి జగన్ అని మీరు అన్నారు కదా అందువల్ల జగన్నే కలవండి. అక్కడే మొక్కుకోండి అని అంటున్నారుట.

ఇక మేము మా సొంత క్యాడర్ కి చేస్తాం, ఎందుకంటే వారు మొదటి నుంచి మాతో ఉన్నారు. వారే మా వెంట మొదటి నుంచి ఉంటూ వచ్చారు. వారే మాకు ముఖ్యమని కూడా చెబుతున్నారుట. అందువల్ల వారికే మేము ఏం చేసినా చేస్తామని ఎమ్మెల్యేలు కొందరు అంటున్నారు అన్నదైతే వైసీపీలో తీవ్ర ప్రచారంగా సాగుతోంది.

వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతోంది అని ఒక వైపు ప్రశాంత్ కిశోర్ టీం తెగ ఊదరగొడుతోంది. మరో వైపు చూస్తే గ్రౌండ్ లెవెల్ లో అసలైన క్యాడర్ ని ఎవరూ పట్టించుకున్న వారు లేరు. ఇక ఎమ్మెల్యేలు తమ వారు అంటూ కొందరికే స్టాంప్ వేసి వారు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీరూ వారూ కాకుండా అంతా కలసి 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎత్తారు. ఆ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు.

మరి అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ వైసీపీలో మా వారూ మీ వారూ అన్న విభజన తెచ్చి వివక్ష చూపుతున్న కొందరు ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే పార్టీ ఎలా ఎత్తిగిల్లుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది. అదే టైం లో వచ్చే ఎన్నికలలో టీడీపీ బలంగా మారి ముందుకు వస్తోంది. ఆ నేపధ్యం నుంచి చూసినపుడు టీడీపీని ఎదుర్కోవడానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిన వైసీపీలో తన వారూ పర వారూ అన్న తేడాలు పెట్టుకుని పనిచేస్తున్న నాయకులు, ఎమ్మెల్యేల తీరు చేటు తెచ్చేలాగానే ఉంది అంటున్నారు.

దాంతో  వైసీపీలో ఇపుడు ఇది పెద్ద చర్చకు తావిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలకు సొంత మనుషులుగా కొందరు ఉన్నారు. వారికి పని చేసిపెడితే చాలు అనుకుంటున్నారు. మరి నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని వేలాది మంది క్యాడర్ ఉంటారు. వారిలో సామాన్యులు ఉంటారు. పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన వారు ఉంటారు. వారిని పక్కన పెడితే అది వైసీపీకి గెలుపు పిలుపుని ఎలా అందిస్తుంది అన్నదే ఇపుడు పార్టీ మేలు కోరే వారి మాట.

మరి ఈ ప్రయారిటీలు ఏంటి, ఎవరు చెప్పారని ఈ విధంగా విభజన రేఖ గీసుకుని కూర్చున్నారు అన్నదే చర్చగా ఉందిట. ఇలా చేస్తూ పార్టీలోని అసలు సిసలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో హై కమాండ్ ఏమైనా దృష్టి పెట్టి వారికి సూచనలు చేస్తుందా అన్నదే ఇపుడు అందరి మాటగా ఉంది. మరి ఇలాగే కనుక వదిలేస్తే రేపటి రోజున ఈ పార్టీ మాది కాదు అనుకుని క్యాడర్ కూడా దూరం అవుతుంది. అది అంతిమంగా పార్టీకే చేటు తెస్తుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News