పుష్క‌రాలు; ఒక‌వైపు వ‌ర్షం.. మ‌రోవైపు భ‌క్త వ‌ర్షం

Update: 2015-07-23 08:55 GMT
ప‌న్నెండేళ్ల‌కు ఒకసారి వ‌చ్చే గోదావ‌రి పుష్క‌రాలు ప‌దో రోజుకు చేరుకున్నాయి. దీనికి తోడు ఈ సారి మ‌హా పుష్క‌రాల‌ని.. 144 ఏళ్ల‌కు ఒక‌సారి మాత్ర‌మే ఇలాంటి పుష్క‌రాలు వ‌స్తాయ‌న్న ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇది కాకుండా.. మ‌రో రెండు రోజుల్లో పుష్క‌రాలు ముగియ‌నున్న నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌లు గోదార‌మ్మ ఒడ్డుకు చేరుకునేందుకు ప‌రుగులు తీస్తున్నారు. పుష్క‌రాలు చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌టంతో.. పుష్క‌ర స్నానం చేయ‌ని వారు.. గోదార‌మ్మ ద‌గ్గ‌ర‌కు బ‌య‌లుదేరుతుండ‌టంతో రెండు రాష్ట్రాల్లోని పుష్క‌ర ఘాట్లు..ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోతున్న ప‌రిస్థితి.

గురువారం ఉద‌యం నుంచే భ‌క్తుల ర‌ద్దీ భారీగా ఉంది. దీనికి తోడు.. ఉద‌యం నుంచే భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తుండటంతో ర‌హ‌దారుల‌న్నీ పుష్క‌ర భ‌క్తుల‌తో నిండిపోయిన ప‌రిస్థితి.

ఏపీలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ.. తెలంగాణ‌లోని ప‌లు చోట్ల భారీగా వ‌ర్షం పడుతున్న ప‌రిస్థితి. వ‌ర్షం ప‌డుతున్నా.. భ‌క్త‌జ‌నం ఉత్సాహం ఏ మాత్రం త‌గ్గ‌టం లేదు. వ‌ర్షంలోనూ పుష్క‌ర స్నానాన్ని ఆచ‌రిస్తున్నారు. వ‌ర్షం కార‌ణంగా ఏర్పాట్ల విష‌యంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. భ‌క్తులు మాత్రం ఇవేమీ ప‌ట్టించుకోవ‌టం లేదు.

ఏపీలోని రాజ‌మండ్రి.. కొ్వ్వూరు.. న‌ర‌సాపురం.. తీప‌ర్రు (పెర‌వ‌లి మండ‌లం).. అంత‌ర్వేది.. కొవ్వూరు.. ద్వారా తిరుమ‌ల‌.. ప‌ట్టిసీమ‌లోని ఘాట్ల‌లో భ‌క్తుల ర‌ద్దీ భారీగా ఉంది. రాజ‌మండ్రికి వాహ‌నాలు భారీగా పోటెత్త‌టంతో.. న‌గ‌రంలోకి వాహ‌నాల రాక‌ను నిషేధిస్తూ అధికారులు నిబంధ‌న‌లు విధించారు. వాహ‌నాల రాక విష‌యంలో నిబంధ‌న‌ల్ని క‌ట్టుదిట్టంగా అమ‌లు చేస్తున్నారు.

అదే విధంగా తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. కాళేశ్వ‌రం.. ధ‌ర్మ‌పురి.. భద్రాచ‌లం.. పోచంపాడు..బాస‌ర‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. కాళేశ్వ‌రం.. ధ‌ర్మ‌పురి వ‌ద్ద వ‌ర్షం ప‌డుతున్నా భ‌క్తుల ఉత్సాహం త‌గ్గ‌టం లేదు. ఇక‌.. భ‌ద్రాచ‌లంలో వ‌ర‌ద నీటి ప్ర‌వాహం పెర‌గ‌టంతో.. నీటి మ‌ట్టం పెరిగింది.

ఆస‌క్తిక‌రంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు పుష్క‌ర స్నానం చేసేందుకు భ‌ద్రాచ‌లానికి ప‌య‌న‌మ‌వుతున్నారు. రాజ‌మండ్రి న‌గ‌రంలోని వాహ‌నాల్ని అనుమ‌తించ‌క‌పోవ‌టంతో.. కృష్ణా.. గుంటూరు.. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన భ‌క్తులు పెద్ద ఎత్తున ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లానికి ప‌య‌న‌మ‌వుతున్నారు. దీంతో.. భ‌ద్రాచ‌లం వెళ్లే ర‌హ‌దారుల‌న్నీ కిక్కిరిసిపోయిన ప‌రిస్థితి.
Tags:    

Similar News