పాత బస్తీలో కొత్త గాంధీ.. ఎవరో తెలుసా?

Update: 2019-08-15 20:10 GMT
బీజేపీని, ఆ పార్టీకి మూలసంస్థయిన ఆరెస్సెస్‌‌పై నిప్పులు చెరగడంలో నిత్యం ముందుండే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తాజాగా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉన్నారని.. వారు తనను చంపేస్తారని ఆయన అన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన గాంధీనే చంపినవారికి నన్ను చంపడం ఓ లెక్కా అనడమే నెటిజన్లకు పెద్ద అస్త్రం దొరికినట్లయింది. గాంధీ - అసద్‌లకు పోలికా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరైతే అసదుద్దీన్ గాంధీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నందుకు ఏదో ఒకనాడు తనను చంపేస్తారని.. గాంధీనే చంపిన వారికి ఒవైసీని చంపడం ఓ లెక్కా అన్నారాయన. అంతేకాదు... తనను చంపేస్తారని తెలిసినా తాను మాత్రం పోరాటం ఆపబోనని, బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మైనారిటీ వర్గాల కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమేనని అన్నారు.

జమ్మూకశ్మీర్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఉండాల్సిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు.

ఇదంతా ఎలా ఉన్నా గాంధీతో తనను పోల్చుకోవడంపై అసదుద్దీన్‌ను నెటిజన్లు ఏకేస్తున్నారు. పాతబస్తీ గాంధీ అంటూ వెటకారమాడుతున్నారు. జమ్ముకశ్మీర్ అంశం తరువాత బీజేపీ తననే టార్గెట్ చేస్తుందన్న భయంతోనే అసద్ ముందుజాగ్రత్త అందరి మద్దతు పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
Tags:    

Similar News