బీజేపీ మాజీ ఎంపీ భూమి కృష్ణాన‌ది ఆక్ర‌మించిందా... ఇంత దారుణం ఉంటుందా...

Update: 2019-07-04 12:15 GMT
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ముందుగా చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయాలని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజులకే ప్రజావేదిక కూల్చివేశారు. ఇక అక్రమ కట్టడాల పరంపరలో రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని క‌ట్ట‌డాలు ఉన్నాయో చూసి మ‌రీ వాటి సంగ‌తి చూడాల‌ని కూడా సీరియ‌స్‌ గా ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు ప‌క్క‌న ఓ బ‌డ్డీ కొట్టు ఉన్న వ్య‌క్తికే ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసి వాళ్ల కొట్టును మూయిస్తుంద‌ని.. అలాంటిది పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మించి క‌ట్టిన భ‌వ‌నాలు విష‌యంలో ఇంకెంత సీరియ‌స్‌ గా ఉండాల‌ని కూడా అధికారుల‌కు కాస్త గ‌ట్టిగానే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్ర‌మ కట్టడాల ప‌ని ప‌ట్టాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని ప్రభుత్వం భ‌వ‌న‌ యజమానులకు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కృష్ణానది కరకట్టపై నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ కు సీఆర్‌ డీఏ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తాను మాజీ ఎంపీని అన్న అహంతోనో లేదా కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందన్న ధీమాయో తెలియదు గాని గోకరాజు గంగరాజు ఈ నోటీసుల‌కు ఇచ్చిన వివరణ చాలా పైత్యంగా వుందనిపించింది. తాను కృష్ణానది భూమిని ఆక్రమించి లేదని కృష్ణా నదే తన భూమిని ఆక్రమించిందని ఆయన  పేర్కొన్నారు. తాను భ‌వ‌నం క‌ట్టాకే న‌దికి 100 మీట‌ర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌న్న జీవో వ‌చ్చింద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

తాను 25 ఏళ్ల నుంచే 25 ఎక‌రాల్లో ఉండ‌వ‌ల్లిలో నివాసం ఉంటున్న‌ట్టు కూడా గంగ‌రాజు చెప్పారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న కృష్ణాన‌దిలో కూడా త‌మ‌కు భూమి ఉంద‌న్న ఆయ‌న‌... ఇక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేస్తే.. రాష్ట్రంలో ఉన్న అన్ని న‌దుల ప‌క్క‌న అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేయాల‌ని వితండ వాదానికి దిగ‌డం మ‌రీ విచిత్రం. రాష్ట్రంలో నిర్మించే నిర్మాణాల్లో చిన్న చిన్న పొర‌పాట్లు అంద‌రూ చేస్తార‌ని.. వారంద‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నాకే త‌మ‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న నీతులు చెప్ప‌డం కొస‌మెరుపు. అంటే తాను త‌ప్పు చేశాన‌ని ఒప్పుకుంటూనే ... ఇంకొక‌రు త‌ప్పు చేశారు క‌దా ? అని ఎత్తి చూప‌డం విచిత్రం.

    
    
    

Tags:    

Similar News