గూగుల్ తీరుపై ఆగ్ర‌హంతో ఉన్న ఉద్యోగులు

Update: 2018-08-18 06:12 GMT
ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ కంపెనీల్లో ఒక‌టి గూగుల్‌. ఈ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చిందంటే చాలు.. జీవితంలో అంత‌కుమించి సాధించాల్సిందేమీ లేద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తూ ఉంటుంది. గూగుల్ లో ఉద్యోగ‌మంటే మామూలు విష‌యంకాద‌ని గొప్పలు చెప్పుకునే వారు లేక‌పోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గూగుల్ కంపెనీలో ప‌ని చేసే ప‌లువురు ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌కు గుడ్ బై చెప్పేసి.. వ్య‌క్తిగ‌తంలో ఎన్నో ఎత్తుల‌కు ఎదిగిన వారెంద‌రో క‌నిపిస్తారు.

మిగిలిన కంపెనీ ఉద్యోగుల‌కు భిన్న‌మైన వ్య‌క్తిత్వం గూగుల్ ఎంప్లాయిస్ సొంతంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. ఇదే.. గూగుల్ ను  ఈ రోజున ఈస్థానంలో నిలుచునేలా చేసింద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఉద్యోగుల‌కు పెద్ద‌పీట వేయ‌టంతో పాటు.. వారి స్వేచ్ఛ‌కు.. సౌక‌ర్యానికి భారీగా ఖ‌ర్చు చేసేందుకు గూగుల్ వెనుకాడ‌ద‌ని చెబుతారు.

ఇదిలా ఉంటే.. గూగుల్ ఉద్యోగులు ప‌లువురు కంపెనీ తీరుపై తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. చైనా ఆంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా గూగుల్ త‌మ సెర్చ ఇంజిన్ ను అభివృద్ధి చేసేందుకే ఓకే చెప్పిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ కోరుకుంటున్నారు గూగుల్ ఉద్యోగులు.

ఈ ప్రాజెక్టు మీద ప‌ని చేసే విష‌యంపై కంపెనీని క్లారిటీ అడుగుతున్న ఉద్యోగులు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే కంపెనీకి లేఖాస్త్రాన్ని సంధించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ లేఖ‌పై 1400 మందికి పైనే ఉద్యోగులు సంత‌కం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. చైనా ఆంక్ష‌ల‌కు త‌లొగ్గి  ప‌ని చేసేందుకు గూగుల్ ఓకే అన‌టం నైతిక విలువ‌ల‌కు సంబంధించిన అంశంగా ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాము దేనిని అభివృద్ధి చేస్తున్నామ‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉద్యోగులు అభిప్రాయ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈప‌రిణామంపై గూగుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News