జీఎస్ టీ బిల్లు కంచికి వెళ్లినట్లే?

Update: 2015-12-18 05:28 GMT
మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించి ఎట్టి పరిస్థితుల్లో అయినా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జీఎస్ టీ బిల్లుకు ఆమోదం అయ్యేలా చూడాలని తపించారు. ఇందుకోసం కాంగ్రెస్ తో రాజీ కోసం ఆ పార్టీ అధినేత్రి సోనియా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను తేనీటి విందుకు ఆహ్వానించి రాయబారాన్ని నడిపారు. అయితే.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన నేషనల్ హెరాల్డ్ ఇష్యూతో పాటు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈసారికి జీఎస్ టీ బిల్లు మీద మోడీ సర్కారు ఆశలు వదులుకుంది.

ఇప్పుడు బిల్లును ఆమోదించుకునేందుకు అవసరమైన బలం రాజ్యసభలో లేకపోవటం.. బిల్లును ప్రవేశ పెట్టి భంగపడే కన్నా.. ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని మోడీ సర్కారు నిర్ణయించింది. అదే సమయంలో.. జఎస్ టీ బిల్లును 2016 ఏప్రిల్ తర్వాత అంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా చూడాలని భావిస్తోంది. మరోవైపు.. ఈ బిల్లును 2017 చివర్లో ఆమోదం పొందేలా చేస్తే.. ఈ బిల్లుప్రభావంతో పన్ను పోటుకు ప్రజల్లో మోడీ సర్కారు మీద మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. అప్పటివరకూఈ బిల్లును లాగాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఇదంత తేలికైన వ్యవహారం కాదని.. ఎందుకంటే.. ఏప్రిల్ నాటికి.. రాజ్యసభలో బలాల సంఖ్యలో మార్పు వస్తుందని.. దీనికి తోడు.. రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతి అన్సారీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలో నియమితులైన నేపథ్యంలో.. జీఎస్ టీ బిల్లుపై ఆయన సానుకూలంగా ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. సభలో స్పష్టమైన బలం వచ్చే వరకూ ఆగి.. ఆ తర్వాత ఈ బిల్లును తెర మీదకు తీసుకురావాలని భావిస్తోంది. అంటే.. జీఎస్ టీ బిల్లు 2016 ఏప్రిల్ తర్వాత మాత్రమే ఆమోద ముద్ర పడే అవకాశం ఉందన్న మాట.
Tags:    

Similar News