ఉద్యోగుల పై చర్యలు తప్పవా ?

Update: 2022-02-05 05:37 GMT
పీఆర్సీ వివాదంపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధమని, సమ్మెను విరమింప చేయాలంటు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమంతో కోవిడ్ పెరిగిపోతుందని ఉద్యోగులకు తెలియదా అంటు నిలదీసింది.

కోవిడ్ నిబంధనలు పాటించకుండా రాష్ట్రాన్ని ఉద్యోగులు ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్లు కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్నే సవాలు చేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయమని కోర్టు తేల్చి చెప్పేసింది. పరిస్ధితులకు తగ్గట్టుగా ఉద్యోగులపై చర్యలు తీసుకునే స్వేచ్చ ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఉద్యోగులను ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఎలా అనుమతించిందని కోర్టు ప్రశ్నించింది.

కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఛలో విజయవాడ లాంటి కార్యక్రమాలను నియంత్రించాలంటు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఉద్యోగుల వాదనలు కూడా విన్న తర్వాత సమ్మె విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు చెప్పింది. ఉద్యోగుల సమ్మె విషయంలో శనివారం కోర్టు తగిన ఆదేశాలిస్తుందని అనుకుంటున్నారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి స్వేచ్చ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి ఆదేశాలే గనుక వస్తే అప్పుడు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విద్యుత్, ఆర్టీసీ లాంటి కీలకమైన శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగితే అప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ మైన్ టెన్స్ యాక్ట్ (ఎస్మా) ప్రయోగించే అవకాశముంది. ఇదే జరిగితే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోక తప్పదు. ఒకపుడు తమిళనాడులో ఉద్యోగులు ఇలాగే సమ్మె చేస్తే అప్పటి సీఎం జయలలిత అందరినీ ఎస్మా చట్టంతో ఉద్యోగాల్లో నుండి తీసేసింది. కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. చివరకు ఉద్యోగులు బతిమలాడుకుంటే అప్పుడు ఇండివిడ్యుల్ గా అఫిడవిట్లు తీసుకుని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నది.
Tags:    

Similar News