తప్పుకుంటున్నట్లు గవర్నర్ చెప్పేసినట్లేనా?

Update: 2015-07-24 04:27 GMT
రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా సేవలు అందిస్తున్న నరసింహన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో వ్యవహరించి.. పొల్లు జారకుండా జాగ్రత్త పడే ఆయన.. అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ నరసింహన్ తీరు పట్ల కేంద్రం అసంతృప్తిగా ఉందని.. ఆయన్ను గవర్నర్ గిరి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తి అయిన తర్వాత ఆయనపై వేటు పడొచ్చని కొందరు.. లేదు ఈ లోపులే తప్పిస్తారని మరికొందరు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

తాజాగా ఇండో.. గ్లోబల్ ఫార్మా సదస్సులో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ వైద్య విధానాలపై సునిశితంగా విమర్శలు చేసిన ఆయన.. తన గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

త్వరలో తాను సాధారణ పౌరుడిని కానున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన చేసిన ఈ వ్యాఖ్య ఏ నేపథ్యంలో అన్న దానిపై స్పష్టత లేనప్పటికీ.. గవర్నర్ ను తప్పిస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. గవర్నర్ నోటి నుంచి తాను సాధారణ పౌరుడ్ని కానున్నానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. జరిగే పరిణామాలపై ఏ మాత్రం సంకేతాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండే నరసింహన్.. తాజాగా తన రాజీనామాపై సంకేతాలు ఇచ్చారా? అన్నది ఒక ప్రశ్నగా మారింది.

ఒకవేళ అదే నిజమైతే.. తన రాజీనామా వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ పట్ల తెలంగాణ సర్కారు సంతృప్తిగా ఉంటే.. ఏపీ సర్కారు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News