గుడికి వెళ్లటం తప్పని అనలేదు గవర్నర్ గారు

Update: 2015-11-30 04:10 GMT
కొన్నిసార్లు ఎవరో ఒకరు మాట్లాడాలి. లేకుంటే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. పాత రోజుల్లో ఏదైనా అంశం మీద ప్రముఖులు ఏదైనా విమర్శ చేస్తే.. దాని మీద చర్చ జరిగేది. దానికి తిరిగి సమాధానం చెప్పే ధోరణి ఉండేది. కానీ.. మారిన పరిస్థితుల్లో మీడియా మీద వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పే వారు లేకుండా పోయారు. విమర్శకు స్పందించటం అంటే.. ఆ విమర్శ చేసింది తామేనని ఒప్పుకున్నట్లు అవుతుందన్నట్లుగా భావించే సరికొత్త థియరీ ధీనికో కారణంగా చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవ సభల సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. గవర్నర్ నరసింహన్.. మంత్రి కేటీఆర్ లాంటి వారు అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రతిఒక్కరూ సుద్దులు చెప్పే ప్రయత్నం చేశారు. మంచి చెప్పటం తప్పేం కాదు. కానీ.. ఆదివారం జరిగిన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన నేతల తీరు చూసినప్పుడు మాత్రం.. వారెవ్వా ఎవరికి వారు మీడియా మీద విరుచుకుపడటానికి ఏ మాత్రం తగ్గలేదే అన్న భావన కలగటం ఖాయం.
మిగిలిన వారి వ్యాఖ్యల్ని కాసేపు పక్కన పెట్టి.. శ్రీమాన్ గవర్నర్ గారి వ్యాఖ్యల్నే తీసుకుందాం. ఆయన మీడియా వ్యవహారశైలి మీద చాలానే విమర్శలు చేశారు. హితవు కూడా చెప్పారు. మీడియాకు జవాబుదారీతనం పెరగాలని.. ఆర్టీఏ కిందకు తీసుకురావాలని.. ప్రవర్తన నియమావళి ఉండాలని.. సామాజిక బాధ్యత తప్పనిసరి అంటూ చాలానే చెప్పుకొచ్చారు. తాను చేస్తున్న విమర్శల చిట్టాతో తాను చేసిన వ్యాఖ్యల్ని ‘‘అసహన’’ ఖాతాలో వేసే ప్రమాదం ఉందని భావించారో ఏమో కానీ.. తాను అసహనంతో మాట్లాడటం లేదన్న మాటను కూడా చెప్పుకొచ్చారు.

గవర్నర్ గారి మాటల్లో ఆయన వ్యక్తిగత అంశానికి సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను గుడికి వెళితే వార్తగా ప్రచురిస్తున్నారని.. గుళ్లకు వెళ్లడాన్ని వార్తలుగా ప్రచురించటాన్ని తప్పు పట్టారు. నిజానికి గవర్నర్ వ్యాఖ్యలకు.. మీడియా సంస్థలన్నీ బాధ్యతతో తిరిగి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ పని మీడియా చేయలేదు. ఎందుకంటే.. ఎవరు దానికి సమాధానం చెప్పినా.. గవర్నర్ చేసిన విమర్శలన్నీ వారికే చెందుతాయని భావించినట్లున్నారు. ఇక.. గవర్నర్ గారి అభ్యంతరాల్ని చూస్తే.. గవర్నర్ గుళ్లకు వెళ్లటాన్ని వార్తగా వేయటం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజున ప్రముఖులు గుళ్లకు వెళ్లటం వార్తలుగా వేస్తున్నారు. ఒక ప్రముఖుడు.. ఫలానా గుడికి వెళ్లారంటూ ఫోటోలతో వార్తలు వేయటం ఎలా తప్పు అవుతుంది. ఆ మాటకు వస్తే.. కొంతమంది ప్రముఖులు.. తాము గుళ్లకు వెళ్లిన ఫోటోలు ఎందుకు వేయరని ప్రశ్నించే పరిస్థితి ఉంది. అందుకే.. అవసరం ఉన్నా.. లేకున్నా.. కొన్ని గుళ్లకు హాజరయ్యే ప్రముఖుల ఫోటోలు ప్రచురించాల్సిన పరిస్థితి.

ఇక.. గుళ్లకు వెళ్లే విషయం గురించి గవర్నర్ అంత ఫీలైనట్లు మాట్లాడటానికి కారణం లేకపోలేదు. గవర్నర్ గా వ్యవహరిస్తూ.. ప్రతి రోజూ తన రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో ఉండే ఖైరతాబాద్ అంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లటం.. దాని కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఒక మీడియా సంస్థ అయితే.. జనవరి 1, 2015 (దాదాపుగా ఇదే రోజు అన్నట్లు గుర్తు) ప్రచురించింది. దీనిపై గవర్నర్ ఎంతో ఫీలయ్యారు. ఇక.. తిరుమల తరచూ వెళ్లటాన్ని కొందరు ప్రస్తావించి విమర్శించారు.

ప్రముఖులు గుళ్లకు వెళ్లటం తప్పు కాదు. కానీ.. తరచూ వెళ్లటం ఇబ్బందే అవుతుంది. ఎలాగంటే.. గతంలో గవర్నర్ తిరుమల వారాల బేసిస్ లో వెళ్లే వారు. గవర్నర్ లాంటి ప్రముఖ వ్యక్తి తిరుమల ఆలయానికి వెళ్తే ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఈ సందర్భంగా గవర్నర్ వారు గుళ్లో ఉన్నప్పుడు సామాన్యుల్ని అనుమతించరు. ఒక గంటపాటు గవర్నర్ గుళ్లో ఉంటే.. దాదాపు 5 నుంచి 8 వేల మంది సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. గవర్నర్ కనుక భక్తిలో మునిగిపోయి గంట కంటే ఎక్కువసేపు ఉంటే.. సామాన్యులకు ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని మీడియా సంస్థలు గవర్నర్ తిరుమల పర్యటనను తప్పు పడుతూ.. కొన్ని కథనాలు ప్రచురించారు. ఇలా ప్రచురించిన వార్తలన్నీ కూడా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకునే తప్పించి.. గవర్నర్ గారి తప్పును ఎత్తి చూపించాలనే కోణంలో కాదన్న విషయం గుర్తెరిగితే మంచిది.

ఇక.. తన సోదరుడు తీవ్రవాదుల చేతుల్లో హతమైతే.. ‘‘కైసా లగ్తాహై’’ అని మీడియా ప్రశ్నించిందని.. ఇలాంటివి సమాజానికి హితం కాదని చెప్పుకొచ్చారు. నిజమే.. అలాంటి మాటల్ని ఎవరూ తప్పు పట్టరు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. పెరిగిన పోటీతో పాటు.. తామరతంపరగా పుట్టుకొస్తున్న మీడియా సంస్థల నేపథ్యంలో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కానీ.. తప్పును.. ఒప్పును కలేసి.. ఒకే గాటిన కట్టేయటం మంచిది కాదన్న విషయాన్ని గవర్నర్ సాబ్ గుర్తెరిగితే బాగుంటుంది. లేదంటే.. ప్రజల గొంతుక కావాల్సిన మీడియా.. పరిమితులకు పరిమితమవుతుంది. ప్రజాస్వామ్యానికి ఇదేమాత్రం మంచిది కాదన్నది గవర్నర్ నరసింహన్ లాంటి పెద్ద మనుషులకు తెలియంది కాదు.
Tags:    

Similar News