గవర్నర్ పరువు గోవిందా

Update: 2015-07-20 13:48 GMT
కేంద్ర ప్రభుత్వంలో గవర్నర్ నరసింహన్ పరువు పోగొట్టుకునే పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తలసాని శ్రీనివాస యాదవ్ తో ఆయన ప్రమాణ స్వీకారం చేయించడమే ఇందుకు కారణమని కూడా వివరిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు గగ్గోలు చేసినా తలసాని రాజీనామాపై గవర్నర్ ఇప్పటి వరకు స్పందించలేదని, ఇప్పుడు ఈ అంశం నేరుగా గవర్నర్ కు చుట్టుకోనుందని చెబుతున్నారు.
తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీ తరఫున ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి మారారు. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండాలి. లేదా అసలు ఎమ్మెల్యే కాకుండా ఉండి ఉండాలి. అంతే తప్పితే ఇతర పార్టీల తరఫున ఎన్నికైన వాళ్లు మంత్రి పదవులకు అనర్హులు. వారితో మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు.. ఫిరాయింపులను ప్రోత్సహించినట్లు అవుతుంది.

అయితే, తలసానికి మంత్రి పదవి ఇస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్ ముందే సమాచారం ఇచ్చారట. దాంతో ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని నరసింహన్ సూచించారట. అయితే, తలసాని రాజీనామా చేయకుండా డ్రామా ఆడారని ఇప్పుడు బయట పడుతోంది. ప్రమాణ స్వీకారానికి ముందు టీడీపీ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన ప్రకటించారు. కానీ ఆయన తన రాజీనామాను స్పీకర్ కు పంపలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే అంశంపై గత ఏడు నెలలుగా విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. అయినా గవర్నర్ నరసింహన్ స్పందించడం లేదు. ఈ అంశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి కూడా వెళ్లింది. ఇప్పుడు తలసాని అసలు రాజీనామా చేయలేదని తెలిస్తే.. ఈ అంశం నేరుగా గవర్నర్ కు చుట్టుకుంటుందని వివరిస్తున్నారు.
Tags:    

Similar News