గ‌వ‌ర్న‌ర్ గుస్సా చూస్తే..ఢిల్లీ బ‌ట‌న్ నొక్కిన‌ట్లుందిగా?

Update: 2019-07-02 04:43 GMT
బాగా చ‌దివే విద్యార్థుల‌కు సున్నా మార్కులు రావ‌ట‌మా?

ఇలాంటి త‌ప్పులు ఎలా జ‌రిగాయి?  దీనికి బాధ్యులు ఎవ‌రు?

తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేదెందుకు?

రెండేళ్ల క్రితం కాలేజీల్లో బ‌యోమెట్రిక్ అమ‌లు చేయ‌మంటే అమ‌లు చేయ‌రా?

ఇలా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ న‌ర‌సింహావ‌తారంతో విద్యాశాఖ అధికారులకు భారీ షాక్ ఇచ్చారు. కొద్ది వారాల క్రితం ఇంట‌ర్ ఫ‌లితాల‌పై చోటు చేసుకున్న ర‌చ్చ‌పై తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న‌త విద్యామండ‌లి ఒక్క‌టంటే ఒక్క పోస్టు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌టాన్ని ప్ర‌శ్నించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే గ‌వ‌ర్న‌ర్ సారు.. ఉన్న‌ట్లుండి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. పాల‌నా తీరును త‌ప్పు ప‌ట్టే రీతిలో రియాక్ట్ కావ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. నూత‌న విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన వేళ‌.. రాజ్ భ‌వ‌న్ లో విద్యాశాఖ‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌ను నిర్వ‌హించారు గ‌వ‌ర్న‌ర్.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల కాలంలో చోటుచేసుకున్న త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తూ గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు కేసీఆర్ స‌ర్కారును ఇరుకున పెట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంట‌ర్.. వ‌ర్సిటీ విద్యావిధానంలో అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై న‌ర‌సింహ‌న్ తీవ్ర అసంతృప్తిని.. ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డిలో ఇంత నిర్ల‌క్ష్యం ఏమిటి?  అందుకు కార‌ణం ఎవ‌రు?   బాధ్యులు ఎవ‌రు?  గుర్తించారా?  గుర్తిస్తే వారి మీద ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన త‌ప్పులు రిపీట్ కాకుండా జాగ్ర‌త్త తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క పోస్టు ఎందుకు భ‌ర్తీ చేయ‌లేద‌న్న ప్ర‌శ్న అధికారుల కంటే కూడా ప్ర‌భుత్వాన్ని సంధించిన‌ట్లుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌భుత్వం అనుకోవాలేకానీ.. ఖాళీల భ‌ర్తీ ఎంత‌సేపు? అన్న మాట వినిపిస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే.. మ‌రోవైపు తెలంగాణ బీజేపీ నేత‌లు ప‌లువురు రాష్ట్రప‌తి కోవింద్ ను క‌లుసుకొని తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డిలో చోటు చేసుకున్న గంద‌ర‌గోళం.. ఆ కార‌ణంగా చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లపై ఫిర్యాదు చేయ‌టం తెలిసిందే. బీజేపీ నేత‌లు ఢిల్లీలో కంప్లైంట్ చేయ‌టం.. దాని ఎఫెక్ట్ ఇమ్మిడియ‌ట్ అన్న‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ సారు వారు గుర్రుతో క్లాస్ పీక‌టం వెనుక ఏమైనా లింక్ ఉందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింద‌ని చెప్పాలి. త‌న‌కెంతో స‌న్నిహిత‌మైన గ‌వ‌ర్న‌ర్ సారు వారు.. ఇంత‌లా ఆగ్ర‌హానికి గురి కావ‌టంపై కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News