కేసీఆర్ పాలనకు గవర్నర్ తమిళ సై జేజేలు

Update: 2020-03-06 11:30 GMT
గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తొలిసారి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తమిళ సై తన ప్రసంగంతో ప్రారంభించారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి శాసనసభకు గవర్నర్ రాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, విధాన నిర్ణయాలను వివరించారు. అందరికీ నమస్కారం అంటూ ప్రసంగం మొదలుపెట్టిన తమిళ సై ఉద్యమ నేతనే తెలంగాణ సీఎంగా ఉన్నారని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు వివక్ష గురయ్యిందని చెబుతూనే స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం వాటన్నిటిని పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలను నివారించామని, పింఛన్ లను పెంచుకున్నామని, ఈ క్రమంలో పింఛన్ల వయసు 57కు తగ్గిస్తామని ప్రకటించారు. చిన్న రాష్ట్రమైనా అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. విద్యుత్, నీటి సమస్యను ప్రస్తుతం అధిగమించామని, సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ప్రసంగమంతా గతంలో ఎలా ఉందో... ప్రస్తుతం ఎలా ఉందని చెబుతూ ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రసంగంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర పరిస్థితులను కళ్లకు కట్టినట్టు గవర్నర్ ప్రసంగం ఉంది.

‘ఆర్థికమాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అన్ని రాష్ట్రాల్లో వృద్ధి రేటు తిరోగమనంలో ఉంది. మన రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు. ఆకలి దప్పులు లేని... అనారోగ్యాలు లేని శతృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యం’ అని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు.

సాగునీటికి పెద్ద పీట వేశామని చెబుతూ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిని వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తూనే, రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నట్లు వివరించారు. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. వైద్యారోగ్యానికి పెద్ద పీట వేసినట్లు వివరించారు.

అయితే గవర్నర్ ప్రసంగాన్ని విపక్షాలు విమర్శించారు. కేసీఆర్ స్క్రిప్ట్ రాసిస్తే గవర్నర్ చదివారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు చెప్పాలని కాంగ్రెస్, టీడీపీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం.
- కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రూ.కిలో బియ్యం అందిస్తున్నాం.
- చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం.
- కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చాం.
- పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి.
- కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది.
- నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం.
- టీఎస్‌ ఐపాస్‌ విధానంతో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
- యాదవులను, నేత కార్మికులను ఆదుకున్నాం.
- గొల్ల, కురుమలకు, సబ్సిడీపై గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ.
- డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి.
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నాం.
- ముల్లా, మౌజీలకు నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం ఇస్తోంది.
- బీడీ కార్మికులకు రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
Tags:    

Similar News