ఫేస్‌ బుక్‌ కు మ‌న స‌ర్కారు నోటీసు ఇచ్చింది

Update: 2017-08-15 11:53 GMT
గూగుల్ - మైక్రోసాఫ్ట్ - యాహూ - ఫేస్‌ బుక్ - వాట్సప్ - ఇన్‌ స్ట్రాగ్రామ్‌...సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలైన వీటికి నోటీసులు ఇవ్వ‌డం అందులోనూ మూకుమ్మ‌డిగా ఇవ్వ‌డం అంటే ఇష్యూ సీరియ‌స్ అయి ఉంటుంది క‌దా? స‌రిగ్గా అదే జ‌రిగింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండ‌ట‌మే కాకుండా అనేక‌మంది ప్రాణాలు తీస్తున్న బ్లూవేల్ ఆన్‌ లైన్ గేమ్ విష‌యంలో ఇలా జ‌రిగింది. ఈ గేమ్‌ బారిన పడి యువకులు - విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లింక్ తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ - మైక్రోసాఫ్ట్ - యాహూ - ఫేస్‌ బుక్ - వాట్సప్ - ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లకు నోటిసులు అందజేసింది.

మూడు రోజులక్రితం పశ్చిమబెంగాల్‌ లోని మిడ్నాపూర్ జిల్లాలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, మధ్యప్రదేశ్ - మహారాష్ట్రలో ఇద్దరు విద్యార్థులు బ్లూవేల్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా సహచరులు - పోలీసులు వారిని కాపాడారు. గత నెల ముంబైకి చెందిన తొమ్మిదోతరగతి విద్యార్థి ఎత్తైన భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో బ్లూవేల్ అరాచకం భారత్‌ లో వెలుగులోకి వచ్చింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే అప్ర‌మ‌త్త‌మై ఈ సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల‌కు సూచ‌న‌ల‌తో కూడిన నోటీసులు ఇచ్చింది.

కాగా, ఈ ఆటను ఆన్‌ లైన్‌ లో నిషేధించాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని మోడీకి లేఖ రాశారు. సమాజానికి మొత్తం సవాల్‌గా మారిన బ్లూవేల్‌ గేమ్‌ పై బాధ్యతాయుత సంస్థలన్నీ సమగ్ర చర్యలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని ఆయన అన్నారు. ఇదిలాఉండ‌గా...మనుషులకు ప్రాణ సంకటంగా మారిన ఆ ఆటను ఫిలిప్‌ బుడైకిన్‌ అనే వ్యక్తి 2013లో సృష్టించాడు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. ఆటకు సంబంధించి ఇటీవల అతడిని ఇంటర్వ్యూ చేయగా పలు కీలక విషయాలు వెల్లడించారు. పరిశుభ్ర సమాజ స్థాపన కోసమే బ్లూవేల్‌ ఆటను సృష్టించినట్టు అతడు తెలిపాడు. ఈ గేమ్‌ లో పాల్గొనే వారందరూ జీవసంబంధ వ్యర్థాలని అన్నాడు. అత‌ను ర‌ష్యాకు చెందిన వ్య‌క్తి. ఆయ‌నో సైకో అని పోలీసులు తేల్చారు.
Tags:    

Similar News