మాక‌న్నా కూలి వాళ్లే న‌యం.. ఏపీ స‌ర్కారుపై ఉద్యోగుల ఆగ్ర‌హం రీజ‌న్ ఇదే!

Update: 2022-12-16 17:30 GMT
ఏపీ ప్ర‌భుత్వానికి, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ధ్య ఉన్న సున్నిత‌మైన బంధం తెగిపోయే ప‌రిస్థితికి చేరుకుందా?  స‌ర్కారుపై నేరుగా ఉద్యోగ  సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలి చేసుకుని పొట్ట‌పోసుకునే కార్మికుల కన్నా దారుణంగా ఉందని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

పాలు, కూరగాయలు, బ్యాంకుల వాళ్ల దగ్గర కూడా ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందనేది సంఘాల నేత‌ల అభిప్రాయంగా ఉంది. ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నేత‌లు ఆరోపిస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదని.. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదని తాజాగా బండి వ్యాఖ్యానించారు.

ఉద్యోగులు నెలంతా పనిచేస్తే 30న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్న ఆయ‌న ఇప్ప‌టికి 15 రోజులు గ‌డిచిపోయినా..ఏపీ ఉద్యోగుల‌కు వేత‌నాలు అందే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక్క నెల జీతం రాకపోతేనే ఇబ్బందులు పడతామ‌ని చెప్పిన ఆయ‌న‌..  కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడితే ఎలా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు ఇస్తామని గ‌తంలో చెప్పిన సీఎం జ‌గ‌న్ ఇప్పుడు ఆ మాట‌ను నిల‌బెట్టుకోలేక పోతున్నార‌ని అన్నారు.

జీపీఎఫ్‌ నిధులను ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవ‌డంపైనా ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.  సామాజిక పింఛన్లను ఒకటో తేదీనే ఇస్తున్న ప్రభుత్వం.. పెన్షనర్లకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే.. ఆయా విష‌యాల‌పై శీత‌క‌న్నేస్తున్న ప్ర‌భుత్వం.. ఉద్యోగుల‌తో ఆడుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య  ఉన్న సున్నిత‌మైన బంధం పూర్తిగా తెగిపోయే ప‌రిస్థితి వ‌చ్చిందనే చ‌ర్చ‌సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News