హ‌రికృష్ణ విష‌యంలో కోదండ‌రాం కొత్త డిమాండ్‌

Update: 2018-08-31 13:46 GMT
దివంగ‌త ఎన్టీఆర్ త‌న‌యుడు - మాజీ మంత్రి నంద‌మూరి హ‌రికృష్ణ క‌న్నుమూయ‌డం అనేక‌మందిని క‌లిచివేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు అధికారిక లాంచ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. దీంతో పాటుగా స్మృతివ‌నం నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ‌వాదుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి నాయ‌కుడు కోదండ‌రాం హాట్ కామెంట్లు చేశారు. రాజకీయ అవసరాలను బేరిజ్ వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోంద‌ని వ్యాఖ్యానించారు. హ‌రికృష్ణ‌కు ద‌క్కిన గౌర‌వ‌మే తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు ద‌క్కాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

హైద‌రాబాద్‌ లో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన కోదండ‌రాం మాట్లాడుతూ ప్ర‌గ‌తి నివేద‌న‌ సభకు రమ్మని టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌జ‌ల‌ను అడిగితే త‌మ సమస్యలను ప్ర‌జ‌లు ప్ర‌స్తావించాల‌ని సూచించారు. ``ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి - పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు అడగండి. నేరేళ్ళలో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి ప్రజలారా.. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి`` అని కోదండ‌రాం పిలుపునిచ్చారు. 4 ఏళ్ల టీఆర్ ఎస్‌ పాలనలో కష్టాలు - కన్నీళ్లు మిగిలాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. `ప్రగతి ఇంకా ప్రగతి భవన్  దాటి  బయటకి రాలేదు. మాకు ఒక కుటుంబం ప్రగతి కనపడుతోంది.  అక్షరాస్యతలో నంబర్ వన్‌ గా ఉంది. అవినీతి లో నెంబర్  2 గా ఉంది. దేశంలో సెక్రటేరియట్ రాని నెంబర్ వన్ సీఎం కేసీఆర్ దీనికి గిన్నిస్ రికార్డ్ లో ఎక్కించాలి. మిషన్ భగీరథ పనులు నత్త నడకన పనులు జరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారు. ధర్నా చౌక్ మూసివేత ప్ర‌భుత్వం తీరుకు నిద‌ర్శ‌నం. ఒక కుటుంబం కోసం...ఒక కాంట్రక్టర్ కోసం పాలన సాగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతిమయం అయింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు.అందుకే అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ  సెప్టెంబర్ 12 నా దీక్ష చేస్తాం`` అని ప్ర‌క‌టించారు.

నందమూరి హ‌రికృష్ణను గౌరవించినట్టు తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని కోదండ‌రాం కోరారు. `సమయానుకూలంగా మేము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తాం. కొండ లక్ష్మణ్ బాపూజీ  - కేశవ్ రావు జాధవ్ - గూడ అంజన్న కూడా గౌరవించుకోవాలి.జోనల్ వ్యవస్థ మార్పుల ప్ర‌కారం లోకల్ గుర్తింపు విషయంలో 1తరగతి నుంచి 10 వ తరగతి వరకు లోకల్‌ గా పరిగణించాలి. మినహాయింపుల విషయంలో ఆలోచన చేయాలి` అని కోరారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామ‌ని కోదండ‌రాం తెలిపారు.
Tags:    

Similar News