చిల్ల‌ర క‌ష్టాల‌కూ దేవుడే దిక్కు!!

Update: 2016-11-15 10:44 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బ్లాక్ బ‌స్ట‌ర్(న‌ల్ల‌ధ‌నంపై పోరు) దెబ్బ‌తో పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోయాయి. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా చిల్ల‌ర స‌మ‌స్య పెరిగిపోయింది. రూ.500, రూ.1000 పాత నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డం, బ్యాంకుల్లో  క‌ష్ట‌ప‌డి కొత్త నోట్లు తీసుకున్నా అవి రూ.2000 కావ‌డంతో జ‌నాల‌కు చిల్ల‌ర లేక చిర్రెత్తుకొస్తోంది. బ్లాక్ మ‌నీ మాటేమోకానీ, మా బుర్ర‌లు మాత్రం ప‌గిలిపోతున్నాయ‌ని దేశ జ‌నాలు ల‌బో దిబో మంటున్నాయి. ఈ క్ర‌మంలో చిల్ల‌ర స‌మ‌స్య‌, కొర‌త తీర్చ‌డంపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ క్ర‌మంలోనే వారికి ఓపేద్ద అయిడియా వ‌చ్చేసింది!!

అదేంటంటే.. దేశంలోని అన్ని హిందూ దేవాల‌యాల్లోనూ ఉన్న హుండీల‌ను త‌క్ష‌ణ‌మే తెరిపించి.. వాటిలో ఉన్న దేవుడి చిల్ల‌ర‌ను జ‌నాల‌కు పంచాల‌ని నిర్ణ‌యించారు. అనుకున్న‌దే త‌డువుగా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఆర్డ‌ర్ పాసైపోయింది. దేవుళ్ల డ‌బ్బును జ‌నాల‌కు పంచాల‌ని, చిల్ల‌ర కొర‌త లేకుండా చూడాల‌ని పేర్కొన‌డంతో దాదాపు స‌మ‌స్య‌కు చెక్ ప‌డిన‌ట్టే న‌ని అంద‌రూ భావిస్తున్నారు. దేశంలోని అన్ని ప్ర‌ధానాల‌య‌ల్లోనూ పెద్ద పెద్ద హుండీలు ఉన్నాయి. వాటిలో భ‌క్తులు ఎక్కువ‌గా రూ.100 - రూ.50 - రూ.20 - రూ.10 నోట్లు స‌హా చిల్ల‌ర నాణేలే స‌మ‌ర్పిస్తారు.

కాబ‌ట్టి ప్ర‌స్తుత త‌రుణంలో ఆ హుండీల్లోని చిల్ల‌ర‌ను పెద్ద ఎత్తున వినియోగించుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. దీనివ‌ల్ల ప్ర‌స్తుతం చెలామ‌ణిలో ఉన్న చిన్న నోట్లు ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున అందుబాటులోకి వ‌చ్చి క‌ష్టాలు తీర‌తాయ‌ని భావిస్తోంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్‌దాస్ అన్ని ప్ర‌ధాన దేవాల‌యాల ట్ర‌స్టుల‌కు విజ్క్ష‌ప్తి చేశారు. త‌క్ష‌ణ‌మే హుండీలు తెరిచి ఆ చిల్ల‌ర‌ను బ్యాంకుల్లో జ‌మ‌చేయాల‌ని ఆయ‌న కోరారు.

అయితే, ఇక్క‌డ కొన్ని ధ‌ర్మ సందేహాలు త‌లెత్తాయి. చిల్ల‌ర లెక్కించేందుకు కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చిల్ల‌ర‌ను బ్యాంకుల‌కు త‌ర‌లించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అంటే ఎంత తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నా.. రెండు మూడు రోజుల త‌ర్వాత కానీ.. ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇక‌, ఇప్ప‌టికైతే.. చిల్ల‌ర క‌ష్టాల‌కూ దేవుడే దిక్క‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News