హెచ్‌1బీ వీసాల వ‌ర్రీ వ‌ద్దంటున్న కేంద్రం

Update: 2017-05-21 04:41 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల పుణ్యాన టెకీల‌కు నిద్ర క‌రువు అయ్యేలా చేసే ఎన్నో ఆదేశాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో లాటరీ ద్వారా వీసాల జారీ విధానానికి స్వస్తి పలికి నైపుణ్యం ఆధారంగా ఆభ్యర్థులకు వీసాలు జారీ చేయనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టెకీలు ఎక్కువ‌గా క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణంగా మారింది హెచ్‌1బీ వీసా. అయితే హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భ‌రోసా ఇచ్చారు. వీసా జారీపై ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పు రావచ్చు కానీ... జారీ చేయనున్న వీసాల సంఖ్య తగ్గకపోవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ఐటీ ఇండస్ట్రీపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎన్డీఏ ప్ర‌భుత్వం మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్‌ విలేకరులతో మాట్లాడుతూ లాటరీ ద్వారా హెచ్-1బీ వీసాల ఎంపికలో మార్పులు రావచ్చుకానీ, సంఖ్య మాత్రం తగ్గకపోవచ్చున‌ని చెప్పారు. అమెరికా జారీ చేస్తున్న మొత్తం వీసాల్లో 17 శాతం దేశీయ కంపెనీలకు లభిస్తున్నాయని, తద్వారా అమెరికా సంస్థలకు కూడా లాభం చేకూరుతున్నదని సీతారామన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణంతో హెచ్-1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలను సమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలతో అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఒకవేళ వీసా నిబంధనల్లో మార్పులు చేస్తే కార్మికులు, అదే విధంగా ఐటీ సంస్థల నిర్వహణ భారం మరింత పెరుగనున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి దేశీయ ఐటీ దిగ్గజాలు 60 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించనున్నట్లు ప్రకటించాయి.

హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో పలు మార్పులపై మంత్రి స్పందిస్తూ..అధిక నైపుణ్యం కలిగిన సిబ్బంది ఎక్కడ లభిస్తారని అమెరికా ప్రభుత్వం చూస్తున్నదని, అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి మాత్రం కష్టతరమవనుందన్నారు. కాగా, 150 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ ఇండస్ట్రీకి వస్తున్న ఆదాయంలో సగం అమెరికా నుంచి లభిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News