కొత్త ఇల్లు కొంటున్నారా? మీకు గుడ్ న్యూస్‌!

Update: 2019-02-25 04:44 GMT
కొత్త ఇల్లు కొనే వారికి భారీ శుభ‌వార్త‌. గుడ్ న్యూస్ లోనూ భారీత‌నం ఏమిట‌ని అనుకుంటున్నారా?  విష‌యం మొత్తం తెలిస్తే అదెంత నిజ‌మో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ మ‌ధ్య‌న కొత్తింటిని కొనుగోలు చేసిన వారిపై విధిస్తున్న జీఎస్టీని త‌గ్గిస్తూ కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జీఎస్టీ మండ‌లి 33వ స‌మావేశంలో తాజా నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు.

నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి త‌గ్గించారు. దీంతో బిల్డ‌ర్ల‌కు ఇచ్చే ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ర‌ద్దు కానుంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ ఒక‌టి నుంచి అమ‌ల్లోకి రానుంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌కు.. గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్నా నిర్మాణం పూర్తి అయ‌న‌ట్లుగా ధ్రువ‌ప‌త్రాలు రాని ఇళ్ల‌కు 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇంటి కొనుగోలుదారుల‌కు భారం భారీగా ఉండ‌టంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

తాజా నిర్ణ‌యంతో కొత్తిల్లు కొనాల‌నుకునే వారికి భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఇదిలా ఉంటే.. అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్ కు ఉన్న జీఎస్టీని సైతం భారీగా త‌గ్గించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న 8 శాతం ప‌న్నును ఒక శాతానికి త‌గ్గించారు. రూ.45 ల‌క్ష‌ల లోపు విలువ ఉన్న ఇళ్ల‌కు కానీ.. మెట్రో న‌గ‌రాల్లో 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు.. ఇత‌ర న‌గ‌రాల్లో 90 చ‌ద‌ర‌పు మీట‌ర్లు వైశాల్యంలో ఉన్న ఇళ్ల‌కు కొత్త నిబంధ‌న వ‌ర్తించ‌నుంది. దీంతో.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి ఊర‌ట ల‌భించ‌నుంది. ఎన్నిక‌ల వేళ‌.. జీఎస్టీ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం మోడీ స‌ర్కారుకు క‌లిసి వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.



Tags:    

Similar News