మ‌ళ్లీ రాష్ట్రాల‌పైనే ఏసేశారుగా.. మొన్న అప్పులు.. ఇప్పుడు జీఎస్టీ!

Update: 2022-07-24 15:34 GMT
అప్పుల విష‌యంలో రాష్ట్రాలు త‌ప్పులు చేస్తున్నాయంటూ.. మొన్న‌టికి మొన్న‌.. రాష్ట్రాల‌పై కేంద్రం ఫైరైంది. తాము ఏ పాపం ఎరుగ‌ము అన్న‌ట్టుగా.. కేవ‌లం రాష్ట్రాలు మాత్ర‌మే అప్పులు చేస్తూ.. దేశాన్ని శ్రీలంక‌ను చేసే దిశగా అడగులు వేస్తున్నాయ‌ని.. హెచ్చ‌రించింది. అంటే.. కేంద్రం అప్పులు చేయ‌డం లేద‌ని.. చెప్పుకొచ్చింది. కానీ, కేంద్రం ఏమేర‌కు అప్పులు చేసిందో నేష‌న‌ల్ మీడియా బ‌హిర్గ‌తం చేసే స‌రికి ఈ విష‌యాన్ని ప‌క్క‌కు త‌ప్పించేసింది.

ఇప్పుడు జీఎస్టీ పాపం.. కూడా రాష్ట్రాల‌పై కే నెట్టేసింది. ఈ నెల 18 నుంచి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ సహా ఆహారపదార్థాలు, నిత్యావసరాలన్నీ పన్ను పరిధిలోకి వచ్చేశాయి. కూరగాయలు మినహా అన్ని ప్యాకెట్లలో ఉండే బ్రాండెడ్‌ పదార్థాలపై 5 నుంచి 18 శాతం వరకు జీఎస్టీ భారం పడింది. అయితే.. ఇదంతా కూడా రాష్ట్రాల పాప‌మేన‌ని కేంద్రం తాజాగా వెల్ల‌డించేసింది. ప్ర‌జ‌ల నుంచివ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను రాష్ట్రాల‌పైనే నెట్టేసింది.

రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు మోడీ స‌ర్కారు తాజాగా స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయం.. రాష్ట్రాల అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యాట్ ద్వారా కోల్పోయే ఆదాయాన్ని పూడ్చేందుకే జీఎస్టీ విధించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదని, జీఎస్టీ మండలిదేనని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. మండలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు మంత్రులు భాగమేనని గుర్తుచేశారు.

జీఎస్టీ అమలులోకి రాకముందు చాలా రాష్ట్రాల్లో 'వ్యాట్' ఉండేది. ఆహార పదార్థాలపై వ్యాట్ విధించడం ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని సంపాదించేవి. బ్రాండెడ్ ప్యాకింగ్ ఉత్పత్తులపైనే పన్ను విధించాలని జీఎస్టీ మార్గదర్శకాల్లో ఉంది. అయితే, అందులోని లొసుగులను ఉపయోగించుకొని కొన్ని పేరున్న కంపెనీలు సైతం.. పన్నును తప్పించుకుంటున్నాయి.  జీఎస్టీకి ముందు తమకు చాలా ఆదాయం వచ్చేదని, ఇప్పుడు దాన్ని కోల్పోతున్నామని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పాయ‌ట‌.దీంతోనే.. జీఎస్టీ విధించార‌ట‌.  ఇదీ.. మోడీ తాలూకు రాజ‌కీయం అంటున్నారు ఆర్థిక నిపుణులు.
Tags:    

Similar News