మోడీ క‌ల‌కు ఆయ‌నే దెబ్బేసుకుంటున్నారా?

Update: 2017-05-20 05:33 GMT
మేకిన్ ఇండియా అంటూ కొత్త నినాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో త‌న ఇమేజ్ గ్రాఫ్‌ను మ‌రింత పెంచుకున్నారు ప్ర‌ధాని మోడీ. అనుక్ష‌ణం దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డే కంటే.. త‌ర‌చూ దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల్ని దేశంలోనే త‌యారు చేసేలా కంపెనీల్ని ఒప్పించి.. సంస్థ‌ల్ని ఏర్పాటు చేసేలా ప్ర‌య‌త్నించ‌టం.. దేశంలో ప‌రిశ్ర‌మ‌ల్ని పెట్టే దిశ‌గా ప్రోత్స‌హించ‌టం లాంటివి మోడీ మేకిన్ ఇండియా ల‌క్ష్యాలుగా చెబుతుంటారు.

అయితే.. ఆ స్ఫూర్తిని దెబ్బేసేలా మోడీ స‌ర్కారు తీసుకోనున్న తాజా నిర్ణ‌యం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా జులై ఒక‌టి నుంచి వ‌స్తు సేవ‌ల ప‌న్ను సింఫుల్ గా చెప్పాలంటే జీఎస్టీని అమ‌లు చేయాల‌ని మోడీ స‌ర్కారు ప‌ట్టుద‌ల‌గా ఉంది. జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ లో వివిధ రాష్ట్రాల ఆర్థిక‌మంత్రుల‌తో క‌లిసి జీఎస్టీ ప‌న్ను విధానానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ఆర్థిక‌మంత్రి జైట్లీ అండ్ టీం.

తాజాగా వినిపిస్తున్న మాట ప్ర‌కారం మొబైల్ ఫోన్ల‌కు జీఎస్టీని 12 శాతంగా నిర్ణ‌యించ‌టంపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అన్నింటికి మించి దిగుమ‌తి చేసుకున్న ఫోన్ల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండేలా.. స్వ‌దేశంలో త‌యార‌య్యే ఫోన్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండేలా నిర్ణ‌యం తీసుకోనున్నార‌న్న మాట ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది.

స్థానికంగా త‌యారు చేసే మొబైల్ ఫోన్ల కంపెనీల‌కు మ‌రింత ప్రోత్సాహం క‌ల్పించేలా.. ఆ ఫోన్ల‌ కొనుగోలుకు ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చేలా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉండాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా జీఎస్టీ రేటు ప్ర‌కారం దిగుమ‌తి చేసుకునే ఫోన్లు చ‌వ‌గ్గా ఉండ‌టం.. భార‌త్ లో త‌యార‌య్యే ఫోన్లు ఖ‌రీదు కానుండ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం దేశంలో అమ్ముడ‌య్యే ఫోన్ల‌లో 80 శాతం (మొద‌టి మూడు నెలల్లో) ఫోన్లు స్థానికంగా త‌యారైన‌వే. గ‌త ఏడాది లెక్క‌లు చూసుకుంటే ఇది 65 శాత‌మే ఉంద‌ని చెబుతున్నారు. దీంతో స్థానికంగా త‌యార‌య్యే ఫోన్లు.. దిగుమ‌తి చేసుకునే ఫోన్ల మ‌ధ్య వ్య‌త్యాసం చూపేందుకు వీలుగా సెల్ ఫోన్ల‌పై బేసిక్ క‌స్ట‌మ్ డ్యూటీని విధించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనిపై మోడీ స‌ర్కారు తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణ‌యం ప్ర‌కారం సెల్యూలార్‌.. ఇత‌ర వైర్ లెస్ నెట్ వ‌ర్క్ కోసం త‌యారు చేసే టెలిఫోన్లు.. విడిభాగాల‌కు 12 శాతం ప‌న్ను విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో భార‌త్ లోకి దిగుమ‌తి చేసుకునే ఫోన్ల మీద ప‌న్ను 17 శాతం నుంచి 27 శాతం వ‌ర‌కూ ఉంది. ఇదిప్పుడు 12 శాతానికి త‌గ్గిపోనుంది. అదే జ‌రిగితే.. స్థానికంగా త‌యార‌య్యే ఫోన్ల ధ‌ర‌ల‌తో పోలిస్తే.. దిగుమ‌తి చేసుకునే ఫోన్ల ధ‌ర‌లు భారీగా త‌గ్గే వీలు ఉంటుంది. అదే జ‌రిగితే.. దిగుమ‌తి చేసుకునే ఫోన్ల‌నే ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుంది. దీని కార‌ణంగా మోడీ మేకిన్ ఇండియా నినాదానికి దెబ్బ ప‌డుతుంద‌ని చెబుతున్నారు. మోడీ క‌ల‌ను మోడీనే దెబ్బేస్తున్నారా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఎక్కువ మంది వినియోగించే ఫోన్ల మీద ప‌న్ను త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల మ‌రింత కొనుగోళ్లు పుంజుకునే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అందుకే..ఎక్కువ మంది వినియోగించే వాటి మీద ప‌న్ను పోటు త‌క్కువ ఉంటే.. ఆ కొనుగోళ్లు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని.. అది చివ‌ర‌కు ప్ర‌భుత్వానికే సానుకూలంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News