మోడీ ఇమేజ్ లెక్క తేలే రోజు డిసైడ్ అయ్యింది

Update: 2017-10-25 08:51 GMT
దేశ ప్ర‌ధాని కుర్చీలో మోడీని కూర్చోబెట్టిందంటే అది గుజ‌రాత్ ప్ర‌జ‌ల పుణ్య‌మేన‌ని చెప్పాలి. గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా అదే ప‌నిగా గుజ‌రాతీయులు ఎన్నుకోవ‌టంతో దేశ ప్ర‌జ‌ల దృష్టి మోడీ మీద ప‌డ‌ట‌మే కాదు.. గుజ‌రాత్ రాష్ట్ర అభివృద్ధి న‌మూనాను చూపించి.. దేశ గ‌మ‌నాన్నే మార్చేస్తానంటూ మోడీ న‌మ్మ‌బ‌లికారు. ఆయ‌న మాట‌ల్ని న‌మ్మి మోడీకి ఓట్లేసి.. ఏకంగా ప్ర‌ధాని కుర్చీలో కూర్చోబెట్టారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధానిగా ప‌ద‌విని చేపట్టిన మూడున్న‌రేళ్ల కాలంలో మోడీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆయ‌న తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ నిర్ణ‌యాల‌పై స‌గ‌టుజీవిలో అసంతృప్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీనికి తోడు ఇప్ప‌టివ‌ర‌కూ అవినీతి మ‌చ్చ లేద‌న్న‌మోడీ స‌ర్కారుకు ఇప్పుడు పాల‌క బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా పుత్ర‌ర‌త్నంగారి వ్యాపారాలు కొత్త చిక్కుల్ని తెస్తున్నాయి.

రెండు నెల‌ల క్రితం కూడా మోడీని విమ‌ర్శించే విష‌యంలో త‌డ‌బాటు ప‌డ్డ విపక్షాలు ఇప్పుడు ఏక‌మై మ‌రీ గ‌ర్జిస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. మోడీ సొంత ఇలాకాలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే.. రెండు వారాల క్రితం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించినప్పుడే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించాల్సి ఉన్న అలా జ‌ర‌గ‌లేదు.

తాజాగా దాని వెన‌కున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ర్చ‌గా మారింది. మ‌రోవైపు.. గుజ‌రాత్ రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి ఇటీవ‌ల కాలంలో షాకుల మీద షాకులు త‌గులుతున్న‌వేళ‌.. ముందుగా చెప్పిన‌ట్లే కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

మొత్తం 182 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను రెండు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది. డిసెంబ‌రు 9.. 14ల‌లో పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. ఓట్ల లెక్కింపు మాత్రం 18న వెలువ‌డ‌నున్న‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి అచ‌ల్ కుమార్ జోతి వెల్ల‌డించారు.

షెడ్యూల్ ప్ర‌కారం గుజ‌రాత్ అసెంబ్లీ గ‌డువు 2018 జ‌న‌వ‌రి 23తో ముగియ‌నుంది. తాజా ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న చూసిన‌ప్పుడు అందుకు నెల రోజుల కంటే ముందే గుజ‌రాత్ ప్ర‌జ‌ల తీర్పు బ‌య‌ట‌కు రానుంది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క‌టైనా పూర్తి మ‌హిళా ఓట‌ర్లు ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఈసీ ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ధాని మోడీ ఇమేజ్ లెక్క తేల్చే డేట్‌.. దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News