గులాబీ గూటికి టీడీపీ ఎంపీ

Update: 2015-10-27 06:42 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నాయ‌కుల వ‌ల‌స బాట కొన‌సాగుతోంది. టీఆర్ ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు దీటుగా తెలంగాణ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం, ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలపై పోరాటం చేయ‌క‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణాలుగా జంప్ జిలానీలు పెరుగుతున్నారు. తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యురాలు, వ‌రంగ‌ల్‌ కు చెంది గుండు సుధారాణి తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇప్ప‌టికే టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల‌తో ఈ విష‌యం చ‌ర్చించిన సుధారాణి...త‌న చేరిక‌కు సీఎం కేసీఆర్ వ‌ద్ద గ్రీన్ సిగ్న‌ల్ పొందారు. ఈ నెల 29వ తేదీన ఆమె టీఆర్‌ ఎస్‌ లో చేరనున్నట్లు సమాచారం. ఆమె నేడు ఢిల్లిలో టీఆర్‌ ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో భేటీ కానున్నారు. కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్ర‌మాల‌కు గుండు సుధారాణి దూరంగా ఉంటున్నారు. త్వ‌ర‌లో వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఉన్న నేప‌థ్యంలో ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిక‌రంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆ పార్టీ నేతలు పలువురు గుండు సుధారాణిని సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లుగా భావిస్తున్నారు. మరి.. సుధారాణి పార్టీ మారిపోతున్నారా? లేక.. మరేదైనా కారణంతో ఫోన్ స్విచ్ఛాప్ చేసుకొని ఉన్నారా? అన్న సందేహాలకు.. ఒకవేళ వేరే కారణం ఉండి ఉంటే.. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే స్పందించటమో లేదంటే.. ఫోన్ చేసి వివరణ ఇవ్వటం ఉండేదని.. కానీ.. అందుకు భిన్నంగా ఎలాంటి సమాధానం లేకుండా ఉండటం అంటే.. గుండు సుధారాణి సైకిల్ దిగి కారెక్కటం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.

మ‌రోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాసేపట్లో టీటీడీపీ నేతలు కలువనున్నారు. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌, ఇత‌ర ప‌రిణామాల‌పై వారు చ‌ర్చించ‌నున్నారు.
Tags:    

Similar News