వాట‌ర్ బాటిల్ లీట‌ర్ 70...స‌ర్కారు ఏం చేస్తోంది?

Update: 2017-03-17 14:22 GMT
వాట‌ర్ బాటిల్ల‌పై ఎమ్మార్పీ ధ‌ర కంటె ఎక్కువ‌గా వినియోగ‌దారుడి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మార్చి6న కేంద్ర‌మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్వీట్ చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. రైల్వే స్టేష‌న్‌ - బ‌స్టాండ్ ఆఖ‌రికి విమానాశ్ర‌యం అయినా ఇదే ధ‌ర ఉండాల‌ని పాశ్వాన్ ఆదేశించారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో చ‌ట్టం తెస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ అదేమీ కాన‌రావ‌డం లేదు. ఏకంగా రూ.70 వ‌సూలు చేయ‌డంతో అవాక్క‌వ‌డం వినియోగ‌దారుడి వంతు అయింది. ఇది జ‌రిగింది సాక్షాత్తు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌ లో.

ఢిల్లీలోని సోడాబాటిల్ ఓపెన‌ర్ వాలా రెస్టారెంట్‌ కు వెళ్లిన ర‌వీంద‌ర్ కుమార్ అనే వ్య‌క్తి  డిన్న‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బిల్లు చూసి షాక్‌ కు గుర‌య్యాడు. త‌ను తీసుకున్న వాట‌ర్ బాటిల్‌ కు బిల్లు రూ.70 వేశారు. బాటిల్‌ పై మాత్రం ధ‌ర 20 రూపాయ‌లే ఉంది. ఇదేంట‌ని రెస్టారెంట్ సిబ్బందిని ప్ర‌శ్నించ‌గా బాటిల్ ధ‌ర ఇక్క‌డ రూ.70గానే ఉంటుందంటూ నిర్ల‌క్ష‌పు స‌మాధానం ఇచ్చారు. అయితే ర‌వీంద‌ర్ కుమార్ గ‌తంలో వాట‌ర్ బాటిల్స్ కోర్టు చెప్పిన తీర్పును యాజ‌మాన్యం దృష్టికి తీసుకొచ్చాడు. ఎంఆర్‌ పీ ధర కంటే ఎక్కువ అమ్మటానికి లేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డున్న రెస్టారెంట్ల‌కు కోర్టు తీర్పుల‌తో ప‌నిలేదని తేల్చిచెప్పారు. దిక్కున్న చోటు చెప్పుకోమంటూ స‌ద‌రు వినియోగ‌దారుడిని దూషించారు. లీటర్ వాటర్ బాటిల్ కు రూ.70 కట్టి బయటకు వెళ్లు అంటూ దమాయించారు. ఎక్కువ మాట్లాడితే బాగుండదు అంటూ కస్టమర పైనే కస్సుబుస్సులాడారు. దీంతో ర‌వీంద‌ర్ త‌న ఫేస్‌బుక్‌లో త‌ను కొన్న కిన్లీ వాట‌ర్ బాటిల్, రెస్టారెంట్ బిల్లును పోస్ట్ చేసి.. రెస్టారెంట్ క‌స్ట‌మ‌ర్ల‌ను దోచేస్తోందంటూ కామెంట్ చేశాడు. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో హైద‌రాబాద్‌ లోని ఓ రెస్టారెంట్‌ లో వాట‌ర్ బాటిల్‌ పై ఉన్న‌ ఎమ్ ఆర్‌పీ ధ‌ర కంటే ఎక్కువ‌గా వ‌సూలు చేసినందుకు ఆ హోట‌ల్ యాజ‌మాన్యానికి రూ.20వేలు జ‌రిమానా విధించారు. మ‌రి ఢిల్లీలోని సోడాబాటిల్ ఓపెన‌ర్ వాలా రెస్టారెంట్‌ కు జ‌రిమానా విధిస్తారో లేదో చూడాలి. అంతేకాకుండా సాక్షాత్తు కేంద్ర మంత్రి ఆదేశించిన విష‌యం నెల తిర‌గ‌కుండానే బుట్ట‌దాఖ‌లు అయిన తీరుపై ఆయ‌న ఏం స‌మాధాన‌మిస్తారో మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News