వైసీపీలోకి అనంత టీడీపీ సీనియర్?

Update: 2018-12-28 15:30 GMT
ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీ నేతలను కుదురుగా ఉండనివ్వడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కడం అనుమానమేనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఆ ఫలితంగానే ఆ పార్టీ నేతలు చాలామంది ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలైతే ఎప్పుడెప్పుడు సొంతగూటికి చేరుకుందామా అని తొందరపడుతున్నారట. అయితే... తొలుత తమను వీడిన నేతలెవరినీ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని భావించిన జగన్ ఇప్పుడు కొంత పట్టు వీడారని.. బలమైన నేతలు వారికివారే వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి త్వరలో వైసీపీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
   
అనంతపురం అర్బన్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్ రెడ్డి నిరుడు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడాయన తిరిగి సొంత గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.  గుర్నాథ్ రెడ్డి 2009 లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 లో వైసీపీ తరపున పోటీ చేసిన ఈయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి అనంతపూర్ లోకి అడుగుపెట్టడానికి కొద్దిగా ముందు గుర్నాథరెడ్డి టీడీపీలో చేరారు.
   
అయితే... టీడీపీలో చేరినప్పటికీ గుర్నాథ్ రెడ్డి అక్కడ ఇమడలేకపోతున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న గుర్నాథ్ రెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్నారట. అందుకు జగన్ నుంచి సానుకూలత రావడంతో త్వరలోనే ఆయన చేరిక ఉంటుందని చెబుతున్నారు. జగన్ - గుర్నాథరెడ్డి కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఆయన్ను తిరిగి తీసుకోవడానికి జగన్ పెద్దగా వ్యతిరేకించలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News