పీకే అంటే!... ప‌వ‌న్ క‌ల్యాణ్ కాద‌ట‌!

Update: 2019-03-02 15:30 GMT
పీకే అంటే... ఏమాత్రం ఆలోచించ‌కుండానే ప‌వ‌న్ క‌ల్యాణే క‌దా అంటాం. టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి ఓ ఐదేళ్ల క్రితం రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ... జ‌న‌సేన పేరిట ఓ రాజ‌కీయ పార్టీని పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్ర‌త్యేకత క‌లిగిన వ్యక్తిగానే మ‌నం ప‌రిగ‌ణిస్తాం. మొన్న‌టిదాకా పార్ట్ టైం పొలిటీషియ‌న్‌గానే క‌నిపించిన ప‌వ‌న్‌... ఇటీవ‌లే ఫుల్ టైం పాలిటిక్స్‌లోకి దిగిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయినా ఇప్పుడు పీకే అంటే ఏమిటి? అనే క్విజ్ ఏమైనా పెట్టారా? అంటే... అదేమీ లేదు గానీ... పీకే అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కాద‌ని, పాకిస్థాన్ కోడ్ అని బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. జీవీఎల్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ క‌థేంటో చూద్దాం ప‌దండి.

అప్పుడెప్పుడో ఉత్త‌రాంధ్ర‌లో విడ‌త‌ల‌వారీ ప‌ర్య‌ట‌న సాగించిన ప‌వ‌న్‌.. చాలా కాలం త‌ర్వాత ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య యుద్ధ మేఘాలు నెల‌కొన్న త‌రుణంలో దీనిపై స్పందించిన ప‌వ‌న్‌... ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌ద‌ని రెండేళ్ల నాడే త‌న‌కు తెలుసున‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మాట త‌న‌కు బీజేపీకి చెందిన ఓ నేత చెప్పారంటూ బాంబు పేల్చారు. మొత్తంగా ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు, వాయు సేన పైల‌ట్ అభినంద‌న్ వర్ధ‌మాన్ పాక్ కు ప‌ట్టుబ‌డటం, నిన్న ఆయ‌న విడుద‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు పెద్ద‌గా ఎక్స్‌పోజ్ కాలేదు గానీ... ఏమాత్రం ఎక్స్‌పోజ్ అయినా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తేవి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌ల చెవికి ప‌వ‌న్ మాట‌లు చేరిపోయాయి.

ఇరు దేశాల మ‌ధ్య ఇప్పుడు కాస్తంత ఉద్రిక్త‌త‌లు త‌గ్గిన నేప‌థ్యంలో నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన జీవీఎల్‌... ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని జీవీఎల్ ధ్వ‌జ‌మెత్తారు. పవన్‌ కల్యాణ్ మాటలను పాకిస్థాన్‌ పత్రికలు వాడుకుంటున్నాయని, రాజకీయాల్లోకి జాతీయ భద్రతను లాగొద్దని ఆయ‌న హిత‌వు చెప్పారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని, అధికార దాహం కోసం జాతీయ భద్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని జీవీఎల్ సూచించారు. ఈ సంద‌ర్భంగానే పీకే అంటే మనం పవన్ కల్యాణ్ అనుకుంటాం, కానీ పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌ కోడ్‌ అనుకుంటున్నారని జీవీఎల్ ఆ ప‌దానికి కొత్త భాష్యం చెప్పారు.


Tags:    

Similar News