వామ్మో!..సాక్షి రీడ‌ర్ల వివరాలూ దొంగిలించేశార‌ట‌!

Update: 2019-03-05 09:32 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేసిన డేటా చోరీ వ్య‌వ‌హారంలో త‌వ్వుతున్న కొద్దీ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల‌కు చెందిన అన్ని ర‌కాల వివ‌రాల‌తో పాటు ర‌హ‌స్య స‌మాచారాన్ని కూడా సేక‌రించేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... దానిని త‌న ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టే ఐటీ గ్రిడ్ సంస్థ‌కు ఇచ్చేసింద‌న్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్వ‌వ‌హారానికి సంబంధించి వైసీపీ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబ‌రాబాద్ పోలీసులు అస‌లు గుట్టును విప్పే ప‌నిని మొద‌లెట్టారు. ఇప్ప‌టికే స‌ద‌రు ఐటీ గ్రిడ్ సంస్థ వ‌ద్ద వైసీపీ ఆరోపిస్తున్న‌ట్లుగా ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం వెలుగు చూడ‌టంతో కేసులు న‌మోదు చేసిన పోలీసులు... స‌ద‌రు సంస్థ చీఫ్ అశోక్ కోసం గాలింపు మొద‌లెట్టేశారు.

ఈ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌తో పాటు సంచ‌ల‌న విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇప్ప‌టిదాకా వెలువ‌డ్డ సంచ‌ల‌న విష‌యాల‌కు మించిన సంచ‌ల‌నం మ‌రొక‌టి బ‌య‌ట‌ప‌డిపోయింది. అదేంటంటే... ఐటీ గ్రిడ్ వ‌ద్ద ఉన్న ఏపీ ప్ర‌జ‌ల స‌మాచారంలో సాక్షి దిన‌ప‌త్రిక చందాదారుల వివ‌రాలు కూడా ఉన్నాయ‌ట‌. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌టుంబం ఆధ్వ‌ర్యంలో సాక్షి ప‌త్రిక‌తో పాటు సాక్షి న్యూస్ ఛానెల్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఫ్యామిలీకి చెందిన ఈ ప‌త్రిక రీడ‌ర్ల‌లో మెజారిటీ ప్ర‌జ‌లు వైసీపీ సానుభూతిప‌రులు, ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే ఉంటారు క‌దా. మ‌రి ఈ వివరాల‌న్నీ కూడా సేక‌రించేసిన ఏపీ ప్ర‌భుత్వం... ఆ వివ‌రాల‌ను ఐటి గ్రిడ్‌కు అందించ‌డం చూస్తుంటే... ఈ వ్య‌వ‌హారం భారీ స్థాయిలోనే సాగుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అస‌లు ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన ల‌బ్ధిదారుల వివ‌రాల‌ను మాత్ర‌మే సేక‌రించామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు అండ్ కో... సాక్షి రీడ‌ర్ల వివ‌రాల‌నూ న‌మోదు చేసిందంటే ఈ కుట్ర మామూలుగా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు బ‌య‌ట‌పెట్టారు. డేటా చోరీపై జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించేందుకు నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన జీవీఎల్... ఐటీ గ్రిడ్ వ‌ద్ద సాక్షి రీడ‌ర్ల వివ‌రాలు కూడా ఉన్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రోజుకో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న ఈ వ్యవ‌హారం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News