మంట పుట్టిస్తున్న సాధ్వి మాట‌లు

Update: 2017-06-16 05:15 GMT
వివాదాస్ప‌ద అంశాల‌పై ఆచితూచి మాట్లాడాల్సి ఉన్నా.. అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా మ‌రింత వివాదం ముదిరేలా వ్య‌వ‌హ‌రించ‌టం ఈమ‌ధ్య‌న కొంద‌రికి అల‌వాటుగా మారింది. ఒక విష‌యాన్ని భిన్న కోణాల్లో చూస్తున్న‌ప్పుడు.. ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఉంది.కానీ.. స‌ద‌రు విష‌యంలో తాము అనుస‌రించే ప‌ద్ధ‌తే స‌రైన‌ద‌న్న భావ‌న ఎవ‌రికి వారికి క‌లిగితే లాభం కంటే నష్ట‌మే ఎక్కువ‌.

ఇలాంటివి లేనిపోని ఉద్రిక్త‌త‌ల‌కు.. వివాదాల‌కు తెర తీసిన‌ట్లుగా అవుతుంది. గోమాంసంపై ఆంక్ష‌లు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ఇప్ప‌టికే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వేళ‌లో.. తొంద‌ర‌ప‌డి వ్యాఖ్య‌లు చేసే క‌న్నా.. కాస్తా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా మ‌రింత మంట పుట్టేలా మాట్లాడ‌టం ఎవ‌రికీ మంచిది కాదు.

కానీ.. ఇలాంటివి సాధ్వి స‌ర‌స్వ‌తి లాంటి వాళ్లు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. తాజాగా తూటాల్లాంటి మాట‌ల్ని ఆమె ప్ర‌యోగించారు. ప్ర‌తిష్ఠ కోసం బీఫ్ తినే వారిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఓప‌క్క అభంశుభం తెలియ‌ని చిన్నారుల‌పై అత్యాచారాలు చేసే పిశాచులకే ఉరి వేయ‌ని దుస్థితి. అలాంటి క‌ఠిన మైన చ‌ట్టాలు చేయవ‌ద్దంటూ మాన‌వ హ‌క్కుల మొన‌గాళ్లు తెర మీద‌కు వ‌చ్చి నానా ర‌చ్చ చేయ‌టం తెలిసిందే. అంత తీవ్ర‌మైన నేరాలు చేస్తేనే లేని ఉరి.. కేవ‌లం బీఫ్ తినే వారికి విధించాల‌న‌టం రెచ్చ‌గొట్టేదే.

ఇక‌.. భార‌త్‌ కు అన్ని వైపుల నుంచి ముప్పు ఉంద‌ని.. జ‌మ్ము కాశ్మీర్ ను భార‌త్ నుంచి విడ‌దీయాల‌ని.. అమ‌ర్ నాథ్ యాత్ర‌ను నిలిపివేయాల‌ని.. భార‌తమాత‌.. గోమాత అన్న మాట‌లు వినిపించ‌కుండా కుట్ర‌ చేస్తున్నారంటూ సాధ్వి ఆరోపిస్తున్నారు. ఇలాంటి తొంద‌ర‌పాటు వ్యాఖ్య‌లు చేసే కంటే కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. హిందువులు ఆయుధాలు సిద్ధం చేసుకోవాల‌ని.. లేకుంటే భ‌విష్య‌త్తులో వినాశ‌న‌మే అంటూ సాధ్వి చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు కొంత మంట‌లు పుట్టిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News