హన్మంతుణ్ని చూసి మురిసిపోయిన చంద్రబాబు!

Update: 2016-08-20 07:25 GMT
హన్మంతుణ్ని చూసి రాముడు మురిసిపోతే అది రామాయణం అవుతుంది. కానీ ఇప్పటికాలంలో ఈ సరికొత్త హనుమంతుణ్ని చూసుకుని చంద్రబాబునాయుడు మురిసిపోతే అది రాజకీయం అవుతుంది. అనగనగా నందిగామలో ఒక హనుమంతరావు. ఆ హనుమంతరావు ఇప్పుడు చంద్రబాబు మురిసిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నాడుట. ఊరూరా ఒక హనుమంతరావు ఉంటే చాలు.. మన ప్రభుత్వం ఎలా చెలరేగినా.. మనకు ఢోకా ఉండదు అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తున్నారట. ఇదంతా బెజవాడ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఇంతకీ ఎవరీ హనుమంతరావు అనుకుంటున్నారు కదా?

అనగనగా నందిగామలో ఒక హన్మంతరావు ఉన్నారు. మొన్న పుష్కరాల్లో మరణించిన విద్యార్థుల్లో ఒకరికి ఆయన బంధువు. అయితే, విజయవాడ కృష్ణా పుష్కరాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్‌ విమర్శించారు. అయితే ఆ సమయంలో ఈ హనుమంత రావు జోక్యం చేసుకున్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు సార్‌.. అంటూ అడ్డుకున్నారట. నదిలో గోతులు.. ఇసుక తవ్వకాల పాపమే కదా అని జగన్‌ చెప్పబోతే.. నదిలోపలి ఉన్న గోతులు వైఎస్‌ హయాం నాటివే సార్‌.. అంటూ.. ప్రవాహం లోపల ఉన్న గోతులు పదేళ్ల కిందటివి అంటూ సదరు హన్మంతరావు.. జగన్‌ మాటలను అడ్డుకుని , ఇరుకున పెట్టారుట. పరామర్శకు వెళ్లిన జగన్‌ కు ఇది షాకే.

కాకపోతే.. హనుమంతరావు ఇలా ఎదురుదాడి చేయడం తెలుగుదేశం వారికి మహదానందంగా ఉంది. జగన్‌ ఎక్కడ ఓదార్పులకు వెళ్లినా - పరామర్శలకు వెళ్లినా.. అక్కడ ప్రతిచోటా హనుమంతరావులాగా ప్రవర్తించడానికి కొందరిని నియమించాలని.. జగన్‌ ను ఇరుకున పడేసేలా.. మాటలతో ఎదురు దాడులు చేయించాలని ఈ స్ఫూర్తితో అనుకుంటున్నారట. తమ లోపాల గురించి ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడే వారి నోళ్లకు ఎలాగోలా తాళాలు వేయాలని చూస్తోంటే చంద్రబాబు ప్రజస్వామ్యాన్ని ఏం కాపాడుతారో మరి.
Tags:    

Similar News