డిసెంబ‌ర్ 19న ఏం జ‌రుగుతుందో చెప్పిన హ‌ర్దిక్‌

Update: 2017-12-04 11:06 GMT
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ త‌న దూకుడును మ‌రింత పెంచారు. కాంగ్రెస్‌ను బ‌హిరంగంగానే వ్య‌తిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే హ‌ర్దిక్ వెనుక యువతరం నిలుస్తున్నా.. పాత తరం పాటిదార్లు మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతుదారులుగానే ఉన్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా తాజాగా హ‌ర్దిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ గ‌త నాయ‌కుల‌కు - ప్ర‌స్తుత నేత‌ల‌కు చాలా తేడా ఉంద‌న్నారు. రైతులు - పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వాజ్‌ పేయ్ నేతృత్వంలోని బీజేపీ వేరని, ప్రస్తుతం అమిత్ షా నేతృత్వంలో ఉన్న బీజేపీ వేరని హార్దిక్ పటేల్ అన్నారు. ప్రస్తుతం అమిత్ షా నేతృత్వంలో ఉన్న బీజేపీలో అందరూ అవివేకులే ఉన్నారని హార్దిక్ పటేల్ విమర్శించారు.

గ‌తంలో పాటీదార్‌ నేత‌లను ప్ర‌లోభాల‌కు గురిచేసిన‌ట్లే..త‌న‌కు సైతం డబ్బులు ఎర‌వేసిన‌ట్లు హార్దిక్ ప‌టేల్ తెలిపారు. సూర‌త్‌లో నిర్వ‌హించే స‌భ‌లో పాల్గొన‌కుండా ఉంటే...రూ.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని ఒక వ్యాపారవేత్త త‌న‌కు ఎర‌వేసిన‌ట్లు హార్దిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ తాను హాజ‌రు అయిన‌ట్లు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ తీరుపై హ‌ర్దిక్ విరుచుకుప‌డ్డారు. 22 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని హ‌ర్దిక్ తెలిపారు. సూరత్‌ లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులు - ఒక ప్రభుత్వ పాఠశాల కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించారని హార్దిక్ పటేల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో సూరత్ లో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎందుకు నిర్మించలేదని హార్దిక్ పటేల్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు అందరికీ న్యాయం జరుగుతుందని హార్దిక్ పటేల్ చెప్పారు. ఇదే డిసెంబర్ నెలలో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెలుతుందని, కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తోందని హార్దిక్ పటేల్ ధీమా వ్య‌క్తం చేశారు.

పాటీదార్ల ఆందోళనను పట్టించుకోని గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఆరు కోట్ల పాటీదార్‌ వర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అందులో భాగంగా పాటీదార్లు ఎవ్వరూ బీజేపీకి ఓటు వెయ్యకూడదని హార్దిక్ పటేల్ మనవి చేశారు. బీజేపీకి పాటీదార్లు దూరం అయితే ఎలా ఉంటుందో డిసెంబర్ 19న మీడియాలో అందరూ చూస్తారని, ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీకి దిమ్మతిరిగిపోతుందని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓట్లు వేయవద్దని మీ బంధువులు అందరికీ ఫోన్లు చేసి చెప్పాలని స‌భ‌కు హాజ‌రైన వారికి హార్దిక్ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, సూరత్‌ లో నిర్వహించిన మోటార్‌ బైక్‌ ల రోడ్‌ షోకు వేల మంది యువత హాజరయ్యారు. జై సర్దార్ - జై పాటిదార్ అని నినదించారు. గుజరాత్‌ లో ఈ దఫా బీజేపీ ఓటమి ఖాయం అని - ప్రజలదే విజయమని పేర్కొన్నారు.

కాగా, పాటిదార్ల‌లోని సీనియ‌ర్ నేత‌లు హార్దిక్‌ ను తమ నాయకుడిగానే గుర్తించడం లేదని వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ అసంతృప్త శ్రేణులు - నేతలు మాత్రమే ఆయనకు మద్దతునిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హార్దిక్‌ కు మద్దతు ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ‌రోవైపు హార్దిక్ సభలకు హాజరయ్యే భారీ జన సందోహం పోలింగ్ కేంద్రాల్లో ఏ మేరకు ఓటుగా మారుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. హార్దిక్‌ కు వ్యతిరేకంగా లీకైన సెక్స్ సీడీ వల్ల ఆయనకు భారీగా సానుభూతి చేకూరుస్తుందని అక్షత్ పటేల్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News