అలా చేస్తే కేసులు పెడ‌తానంటున్న హ‌రీశ్‌!

Update: 2018-03-09 11:12 GMT
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు.. రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖామంత్రి హ‌రీశ్ రావుకు కోపం వ‌చ్చింది. అది కూడా ఎంతంటే.. నా మీద ఇలాంటి ప్ర‌చారం చేస్తారా?  ఇలాంటి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటా.. కేసులు పెట్టేస్తా అనేంత ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మీడియా మీద ఎప్పుడు విసుక్కోని హ‌రీశ్ ఈసారి మాత్రం బాగా హ‌ర్ట్ అయిన‌ట్లుగా క‌నిపించారు.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేసినా.. తానెంత భావోద్వేగంతో ఉన్నా మీడియాతో మాత్రం సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం హ‌రీశ్‌ కు మొద‌ట్నించి అల‌వాటు. కింది స్థాయి నుంచి ఎదిగిన నేత‌గా.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉన్న నేత‌గా ఆయ‌న‌కు మీడియాతో ఎలా ఉండాల‌న్న విష‌యాన్ని ఎవ‌రూ నేర్పించాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయితే.. మీడియాకు సోష‌ల్ మీడియాకు భారీ వ్య‌త్యాసం ఉంది. ఆ విష‌యాన్ని హ‌రీశ్ గుర్తించిన‌ట్లు ఉన్నారు.

మీడియా ఫ్రెండ్లీగా ఉండే హ‌రీశ్‌ కు తాజాగా త‌న మీద సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. త‌న మీద జ‌రుగుతున్న దుష్ప్ర‌చారంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. తాను పార్టీ మారుతున్న‌ట్లుగా వ‌స్తున్న ప్ర‌చారంపై ఫైర్ అయ్యారు.

త‌న పుట్టుక‌.. చావు టీఆర్ ఎస్ లోనేన‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్య‌మంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వ‌చ్చిన తాను.. టీఆర్ ఎస్ లో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌గా అభివ‌ర్ణించుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాటే త‌న బాట‌గా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

టీఆర్ ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన హ‌రీశ్‌.. బ‌డ్జెట్ స‌మావేశాల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. కాంగ్రెస్ నాయ‌కులు చెప్పే మాట‌ల్ని న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వారిని న‌మ్మే ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు లేర‌న్నారు.

కాంగ్రెస్ హ‌యాంలో విద్యుత్ కోత‌లు ఉంటే.. టీఆర్ ఎస్ హ‌యాంలో విద్యుత్ సౌక‌ర్యంగా మారింద‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులుగా మారిస్తే.. తాము ర‌న్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌న్న ఆయ‌న‌.. కాంగ్రెస్‌ కు ప్ర‌తిప‌క్ష పార్టీ స్థానం కూడా ద‌క్క‌ద‌న్నారు. ఇప్పుడున్న సీట్లు కూడా ద‌క్క‌వంటూ.. త‌న మేన‌మామ కేసీఆర్ చెప్పిన మాట‌ల్నే హ‌రీశ్ వ‌ల్లెవేశారు. ఎంతైనా.. మేన‌మామ‌ను విప‌రీతంగా అభిమానించి.. ఆరాధించే హ‌రీశ్ నోటి నుంచి ఆయ‌న మాట‌లు రావ‌టం త‌ప్పేం కాదు.
Tags:    

Similar News