అలాంటి గుర్తింపులేవీ మనకుండవా బాబు?

Update: 2016-03-19 09:17 GMT
మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ఎలాంటి ప్రయోజనాలు పొందని ఘనత ఎవరిదైనా అంటే అది ఏపీలోని చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. రాజధానికి భారీగా నిధులు.. వివిధ పథకాల కింద నిధులు తేలేని దుస్థితిలోనే కాదు.. మంత్రివర్గంలో తమ వంతు వాటాగా పొందింది తక్కువే. ఇవన్నీ ఒకటైతే.. కేంద్రంలో ఉండే కొన్ని ముఖ్య పదవుల్లో తమ వాళ్లకు వచ్చేలా చేసుకోవటంలోనూ బాబు ఫెయిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

పార్టీలో సమర్థవంతులకు అవకాశాలు కల్పించటం.. వారికి ఎంతోకొంత మైలేజ్ పొందేలా చేయటం లాంటివేమీ కనిపించవు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మినహాయించి.. ఛరిష్మా ఉన్న సమర్థులైన నేతలన్న వెంటనే బారెడు లిస్ట్ రాకున్నా.. కనీసం మూడు.. నాలుగు పేర్లు అయినా తెర మీద కనిపిస్తాయి. కానీ.. అలాంటిదేమీ ఏపీ సర్కారులో కనిపించదు.

ఇదే విషయాన్ని అర్థం చేసుకున్న కేంద్రం.. కొన్ని పదవుల విషయంలో సమర్థవంతులైన వారి కోసం వెతుకుతూ.. మిత్రపక్షం కాకున్నా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలకు కట్టబెట్టటం కనిపిస్తుంది. మిషన్ కాకతీయ పనుల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ప్రశంసలు పొందుతున్న హరీశ్ ను కేంద్రం గుర్తించింది. తాజాగా.. కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ కేంద్రమంత్రి ఉమాభారతి నిర్ణయం తీసుకున్నారు.

తాజా ఎంపికతో హరీశ్ రావు ప్రతిభ జాతీయ స్థాయిలో ఎంతోకొంత బయటకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు.. పలు జల వివాదాల పరిష్కారానికి కానీ హరీశ్ ప్రయత్నిస్తే.. అదంతా ఆయన అకౌంట్లోకి నేరుగా చేరటమే కాదు.. భవిష్యత్ అవకాశాలకు ఇదో మార్గంగా మారుతుందనటంలో సందేహం లేదు. మరి.. ఇలాంటి అవకాశాలు బాబు బ్యాచ్ లోని వారికి ఎందుకు రావటం లేదు..?
Tags:    

Similar News