హ‌రీశ్ కు ఆహ్వానం లేద‌ట‌.. ఏం జ‌ర‌గ‌నుంది?

Update: 2019-02-08 05:21 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్య‌మ బ‌రిలోకి దిగిన కేసీఆర్ కు మొద‌ట్నించి వెన్నంటి ఉన్న వారిలో మాజీ మంత్రి క‌మ్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు ఒక‌రు. బంధుత్వంతో పాటు.. కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా మొదట్లో అంద‌రి నోళ్ల‌ల్లో నానిన హ‌రీశ్ హ‌వా ఒక రేంజ్లో ఉండేది. త‌ర్వాతి కాలంలో కేటీఆర్ ఎంట్రీ ఇవ్వ‌టం.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. హ‌రీశ్ కు ప‌రిమితులు విధించ‌టం ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా జ‌రిగిపోయాయి.

కేసీఆర్ త‌ర్వాత హ‌రీశే అన్న స్థానం నుంచి కేటీఆర్ తో స‌మానంగా చూసే స్థాయికి త‌గ్గి.. త‌ర్వాతి రోజుల్లో ఆయ‌న త‌ర్వాత కూడా స్థానం ఉందా?  లేదా? అన్న సందేహం వ‌చ్చే వ‌ర‌కూ వెళ్ల‌టం చాలామందిని వేధించే విష‌యం. సొంత మేన‌ల్లుడి విష‌యంలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరును చాలామంది లోగుట్టుగా త‌ప్పు ప‌డుతూ ఉంటారు.

హ‌రీశ్ లాంటి మేన‌ల్లుడు అంద‌రికి దొర‌క‌ర‌ని.. అలాంటి వ్య‌క్తిని అంత‌కంత‌కూ త‌గ్గిస్తూ చేయ‌టం వెనుక కేసీఆర్ వ్యూహం ఏమిట‌న్న‌ది ఒక ప‌ట్టాన అర్థం కాదు. త‌ప్పులు చేయ‌కున్నా.. స్థానం త‌గ్గించ‌టం.. ప్రాధాన్య‌త లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. సొంత మీడియాలో కొంత‌కాలంపాటు ఫోటో కూడా రాకుండా చేయ‌టం లాంటివి గులాబీ పార్టీలో త‌ర‌చూ హాట్ టాపిక్స్ గా మారుతూ ఉంటాయి.

ఎన్నిక‌ల వేళ.. హ‌రీశ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేస‌రికి మాత్రం మేన‌ల్లుడి అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి కావ‌టంతో పిలిపించుకొని మ‌రీ.. త‌న గ‌జ్వేల్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌టం తెలిసిందే. ఏ మాట‌కు ఆ మాట చెప్పాలి. హ‌రీశ్ మ‌న‌సులో ఏముందో కానీ.. త‌న విష‌యంలో అదే ప‌నిగా శీల ప‌రీక్ష చేసిన‌ప్ప‌టికీ.. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రించిన వైనం మాత్రం ప‌లువురిని ఆక‌ట్టుకుంటూ ఉంటుంది.

ఎన్నిక‌లు ముగిసి.. బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించిన‌ త‌ర్వాత నుంచి హ‌రీశ్ ప్రాధాన్య‌త మ‌రింత త‌గ్గిపోయిన‌ట్లుగా చెబుతారు. ఇరిగేష‌న్ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న్ను.. ఆ శాఖ‌కు సంబంధించిన అంశాల్లో క‌నిపించ‌కుండా చేయ‌టం.. వాటిని కేసీఆర్ స్వ‌యంగా చూడ‌టం.. ప‌లు కీల‌క‌మైన రివ్యూ మీటింగ్స్ కు హ‌రీశ్ ను పిల‌వ‌క‌పోవ‌టం త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంది. ఇదంతా దేనికి సంకేతం? అన్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది.

త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న మంత్రివ‌ర్గంలో హ‌రీశ్ కు చోటు ద‌క్క‌ద‌న్న ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. కేసీఆర్ స‌న్నిహితుల‌కు సొంత‌మైన చాన‌ల్ లో ఒక క‌థ‌నం తాజాగా ప్ర‌సార‌మైంది. అందులో హ‌రీశ్ కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ల‌భించ‌ద‌ని.. ఆయ‌న్ను ఎంపీ బ‌రిలోకి దిగుతార‌న్న అంచ‌నాను వ్య‌క్తం చేయ‌టం చూస్తుంటే.. రాష్ట్ర స్థాయిలో ప‌గ్గాల‌న్నీ కేటీఆర్‌ కు అప్ప‌జెప్పేయ‌ట‌మే కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

కొడుకు కేటీఆర్‌ కు ఎలాంటి పోటీ లేకుండా చేసే ప‌నిలో భాగంగానే హ‌రీశ్ ను ఢిల్లీకి తీసుకెళ్లాల‌ని కేసీఆర్ ప్లాన్ చేసి ఉంటార‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమైనా.. ఈ విష‌యంపై క్లారిటీ రావాలంటే మ‌రో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మంత్రివ‌ర్గ ప్ర‌క‌ట‌న‌తో హ‌రీశ్ విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న ఏమిట‌న్న విష‌యంపై కాసింత స్ప‌ష్ట‌త వ‌చ్చే వీలుంద‌న్న అభిప్రాయం గులాబీ పార్టీ నేత‌ల మాట‌ల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News