కేబినెట్‌ లో కేటీఆర్ లేకుంటే హ‌రీశ్ ఉండ‌ర‌ట‌!

Update: 2019-01-30 09:11 GMT
అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల త‌ర్వాత కూడా మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇన్నేసి రోజులు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా శాఖ‌ల‌న్నింటిని (అలీకి అప్ప‌జెప్పిన శాఖ‌లు మిన‌హాయించి) త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకున్న వైనంపై గులాబీ నేత‌ల మ‌ద్య గుస‌గుస‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి.

యాగం పూర్తి అయిపోయిన నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వులు ఇచ్చే విష‌యంపై కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే కేబినెట్ క‌స‌ర‌త్తు పూర్తి చేసిన కేసీఆర్‌.. త‌న కుమారుడు.. మేన‌ల్లుడి విష‌యంలో ఒక క్లారిటీతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌న్న దానిపై స్ప‌ష్ట‌త రాని ప‌రిస్థితి నెల‌కొంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. కేసీఆర్ తాజా కేబినెట్‌ లో కేటీఆర్ పేరు లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌కేటీఆర్‌ ను.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టం స‌రికాద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. కేటీఆర్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ని వేళ‌.. హ‌రీశ్ ప‌రిస్థితి ఏమిటి? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉన్న వారు ఈ అంశంపై మూడు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నారు.

అందులో మొద‌టిది.. కేటీఆర్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా హ‌రీశ్ కు ఇవ్వ‌టం అంటే.. కేటీఆర్ కు మించిన ప్రాధాన్య‌త హ‌రీశ్ కు ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని.. అదేమాత్రం బాగోద‌న్న ఆలోచ‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. కేటీఆర్ కాకుండా మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ పార్టీలో ఉండ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. హ‌రీశ్ ను కూడా కేబినెట్‌ లోకి తీసుకోకుండా ఉంటార‌న్న మాట వినిపిస్తోంది.

రెండో వాద‌న ప్ర‌కారం హ‌రీశ్‌ ను కేబినెట్‌ లోకి తీసుకున్న‌ప్ప‌టికీ కీల‌క‌మైన ఇరిగేష‌న్ ను కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకొని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రిగా బాధ్య‌త‌లు ఇవ్వ‌టంతో పాటు.. మ‌రో రెండు అప్రాధాన్య‌త శాఖ‌ల్ని హ‌రీశ్‌ కు క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మూడో వాద‌న ప్ర‌కారం కేటీఆర్ ను కేబినెట్‌ లో తీసుకోని నేప‌థ్యంలో హ‌రీశ్ కు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న‌తో పాటు ఢిల్లీకి తీసుకెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు. అలా జ‌రిగితే.. రాష్ట్ర వ్య‌వ‌హారాలు మొత్తం కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. కేబినెట్‌ లో ఎవ‌రెవ‌రు ఉంటార‌న్న దాని కంటే కూడా.. కేటీఆర్.. హ‌రీశ్ లు ఉంటారా?  ఉండ‌రా? అన్న దానిపైనే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News