ఓట్ల కోసం మోడీ ఈ రిస్క్ తీసుకుంటార‌ట‌

Update: 2019-01-31 12:43 GMT
సెమీఫైనల్స్ ఎపిసోడ్ అనే ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో తీవ్ర‌మైన చేదు అనుభ‌వం ఎదుర‌వ‌డం, మ‌రోవైపు పార్ల‌మెంటు స‌మావేశాలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు అధికార పక్షం సిద్ధం అవుతోంది. మరోవైపు విపక్షాలు రాఫెల్ కుంభకోణం, వ్యవసాయ సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గురువారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13తో ముగిస్తాయి. నరేంద్రమోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలుగా భావిస్తున్న నేప‌థ్యంలో మోడీ ఈ ఎపిసోడ్‌ లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ప్రస్తుత ఎన్నికల సంవత్సరంలో కేంద్రం సంప్రదాయాలకు భిన్నంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కు బదులుగా ప్రజాకర్షక పథకాలతో కూడిన మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్/మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన సందర్భాలున్నాయి. ఈసారి పాత సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల సూచనప్రాయంగా చెప్పారు. ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతున్నది. దీని నుంచి పక్కకు జరుగకుండా ఉండేందుకు ఎటువంటి కారణాలు కనిపించడంలేదు. ప్రస్తుత దశలో వీటిని వెల్లడించడం లేదా వీటి గురించి చర్చించడం కుదరదు అని జైట్లీ ఈ నెల 17న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.

అయితే, దీనికి వెంట‌నే కౌంట‌ర్ వ‌చ్చింది.  కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సముచితం కాదని తెలిపారు. దేశ వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌ని, ఉపాధి కల్పన వేగవంతం కావడం లేదని, బ్యాంకుల్లో మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని, మోడీ సర్కార్ ఈ సమస్యలను పరిష్కరించకుండా ఆర్థిక గణాంకాలకు లేనిపోని మెరుగులద్ది ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కాగా, సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు వీలుగా వ్యవసాయ రంగానికి సహాయ ప్యాకేజీని ప్రకటిస్తామని జైట్లీ ఇటీవల చెప్పారు. వ్యవసాయ సంక్షోభ తొలిగింపునకు త్వరలో కొన్ని కీలక చర్యలను ప్రకటించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కూడా సంకేతాలివ్వడంతో ఈసారి బడ్జెట్‌ లో వ్యవసాయానికి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తున్నది. తెలంగాణ రైతుబంధు తరహాలో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడిగా ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందజేయాలని కేంద్రం నిర్ణయిస్తే రానున్న ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ ద్రవ్యలోటు 72 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మ‌రో వారంలో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త రానుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News