అనకాపల్లిలో ‘బాహుబలి’ లారీ అదరకొట్టేసింది

Update: 2016-06-20 07:42 GMT

లారీకి ఎన్ని చక్రాలు ఉంటాయి అని అడిగిన వెంటనే ఇదో ప్రశ్నా? అన్నట్లు చూస్తారు. తర్వాతి ప్రశ్నగా.. మీరు చూసిన అతి పే..ద్ద లారీకి ఉండే చక్రాలు ఎన్ని అని అడిగితే.. సమాధానం చెప్పటానికి కాస్త ఆగుతారు. ఎవరు చెప్పినా పాతికలోపు చక్రాల లారీ గురించి మాత్రమే చూశామని చెబుతారు. కొద్దిమంది మాత్రం వందకు పైగా చక్రాలున్నలారీ గురించి విన్నామని చెబుతారు. కానీ.. ఇప్పుడు మేం చూపించే ఈ లారీకి ఏకంగా 320 చక్రాలు ఉంటాయి.

ఎక్కడో మనకు సదూరన ఉన్న దేశంలో ఇలాంటి లారీ ఉండి ఉంటుందని ఫీలైతే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ బాహుబలి లారీ తెలుగు నేల మీదుగా వెళ్లింది. ఈ జెయింట్ లారీ రోడ్డు మీద వెళుతుంటే.. రోడ్లు బిక్కచచ్చిపోయే పరిస్థితి. ఇక.. ఈ లారీని చూసినోళ్లకు నోటి వెంట రాని పరిస్థితి. ఈ లారీ కారణంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా చూడటం కోసం ఏకంగా 50 మంది సెక్యురిటీ ఉంటారు. అయినా కూడా.. ఈ లారీ కారణంగా రోడ్ల మీద వాహనదారులంతా నానా ఇబ్బందులు పడాల్సిందే.

భారీ యంత్ర పరికరాల లోడ్ తో కోల్ కతా నుంచి చెన్నైకి వెళుతున్న ఈ బాహుబలి లారీ అనకాపల్లి జాతీయ రహదారి మీద కెమేరాకు చిక్కింది. ఈ లారీ పొడవు మాత్రమే కాదు.. ఎత్తు కూడా కరెంటు తీగల్ని తగిలే అవకాశం ఉండటంతో.. అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా మరో నాలుగు వెహికిల్స్ లో దీన్ని ఫాలో కావటం కనిపిస్తుంది.

ఈ లారీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకూడదని చాలానే ఏర్పాట్లు చేసినా.. ఈ బాహుబలి లారీ దెబ్బకు నేషనల్ హైవే మీద మిగిలిన వాహనాలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ వాహనాన్ని ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎవరికి వారు వారి వారి వాహనాల్ని పక్కకు పెట్టుకొని జాగ్రత్త పడేందుకు నానా అవస్తలు పడాల్సి వచ్చింది. 320 చక్రాలున్న లారీ అంటే మాటలా మరి..?
Tags:    

Similar News