బీజేపీ కి ఎదురు దెబ్బే, రాజ్య‌ స‌భ‌లో మెజారిటీ క‌లే!

Update: 2020-01-06 07:49 GMT
2014 లో కేంద్రం లో అధికారం లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీకి రాజ్య‌స‌భ‌లో మెజారిటీని సంపాదించ‌డం ఒక క‌ల‌గానే మిగిలింది. అప్ప‌టి నుంచి కూడా క‌మ‌లం పార్టీ రాజ్య‌స‌భ‌ లో మెజారిటీని  పొంద‌ లేక‌పోతూ ఉంది. దీని కోసం అనేక ఎత్తుగ‌డ‌లు వేసినా, తెలుగుదేశం పార్టీ ని రాజ్య‌స‌భ‌ లో విలీన‌మే చేసుకున్నా.. క‌మ‌లం పార్టీ మాత్రం ఇంత వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌లో మెజారిటీని సాధించుకో లేక‌పోతోంది. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌ లో మూడో వంతు స‌భ్యులు రిటైర్డ్ కాబోతున్నారు. ఆ సీట్ల‌కు రాష్ట్రాల వారీగా మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో కూడా రాజ్య‌స‌భ‌లో బీజేపీకి మెజారిటీ ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న ఎంపీల్లో 18 మంది బీజేపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు 16 మంది ఉన్నారు. ఇత‌ర పార్టీల వాళ్ల‌తో క‌లిపి మొత్తం 73 మంది ఎంపీలు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.

ఇటీవ‌లే బీజేపీ ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిని ఎదుర్కొంది. కొన్ని చోట్ల అధికారాన్ని ఎలాగోల నిల‌బెట్టుకున్న‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య భారీ గా త‌గ్గింది. అయితే యూపీలో బీజేపీకి బ‌లం ఉంది. అక్క‌డి నుంచి ప‌ది రాజ్య‌స‌భ సీట్లు భ‌ర్తీ కాబోతున్నాయి. ఇక మ‌హారాష్ట్ర ఖాతాలో ఏడు, త‌మిళ‌నాడు ఖాతాలో ఆరు, బిహార్, బెంగాల్ ఖాతాల్లో ఐదు చొప్పున‌, ఏపీ, గుజ‌రాత్, క‌ర్ణాట‌క‌, ఒడిశాల ఖాతాల్లో ఒక్కో రాష్ట్రానికి నాలుగు చొప్పున‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్తాన్ రాష్ట్రాల ఖాతాల్లో మూడు, తెలంగాణ‌, హ‌ర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు సీట్ల చొప్పున ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మిగ‌తా సీట్లు వివిధ రాష్ట్రాల ఖాతాల్లో ఉన్నాయి.

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ బ‌లా బ‌లాల‌ను బ‌ట్టి.. బీజేపీకి పాతిక వ‌ర‌కూ సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఒక ర‌కంగా రాజ్య‌స‌భ‌లో అలా బీజేపీ బ‌లం పెర‌గ‌బోతోంది. కానీ.. మెజారిటీ మార్కును మాత్రం క‌మ‌లం పార్టీ అందుకోలేదు. య‌థారీతిన రాజ్య‌స‌భ‌ లో మెజారిటీ కోసం క‌మ‌లం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర స‌మితి, బీజూ జ‌న‌తాద‌ళ్ వంటి పార్టీల మీద ఆధార‌ప‌డాల్సిందే.


Tags:    

Similar News