ఏపీలో మూడు బ్యాచ్ లై జనం కొట్టుకుంటున్నారు

Update: 2019-04-07 06:18 GMT
ఎన్నికలు మరో వారం కంటే తక్కువకు వచ్చేసిన వేళ.. ఏపీ రాజకీయం మరింత హాట్ హాట్ గా మారుతోంది. అధికార.. విపక్షాల విమర్శలు.. ఆరోపణలతో పాటు.. గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏపీని మరింత ఉద్రిక్తంగా మార్చేస్తున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల వేళ ఏపీ ప్రజల మధ్య రాజకీయ వైరం పార్టీ స్థాయిల నుంచి వ్యక్తిగత స్థాయిలకు చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీలోని తాజా పరిస్థితులతో పాటు.. గడిచిన కొంతకాలంగా ఏపీ వ్యాప్తంగా పర్యటించిన తనకు ఏమేమీ అంశాలు తెలిశాయో.. వాటన్నింటినిపైనా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సినీ నటుడు శివాజీ. ఏపీ ప్రత్యేక హోదా మొదలు విభజన ఉద్యమం సందర్భంగా ఏపీకి జరిగే నష్టం గురించి మాట్లాడిన ఒకే ఒక్క సినీ నటుడిగా శివాజీని చెప్పాలి.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే..కాసింత ఆందోళన కలిగించక మానదు. ఏపీలో మూడు బ్యాచ్ లుగా మారిన జనం కొట్టుకుంటున్నారన్నారు.  చంద్రబాబు.. జగన్.. పవన్ బ్యాచులుగా విడిపోయిన ఏపీ ప్రజలు రాజకీయ వైరంతో కొట్టుకుంటున్నట్లు చెప్పారు.  కమ్మ.. రెడ్డి.. కాపులుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని వాస్తవాల్ని గుర్తించేందుకు తాను రాష్ట్రం మొత్తం పర్యటించానని.. పలు విమర్శలు.. ఆరోపణలపైనా తాను సర్వే చేసినట్లు శివాజీ చెప్పారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమలను తాను సందర్శించినట్లు ఆయన చెప్పారు. టీడీపీ సర్కారు చెప్పినట్లుగా పరిశ్రమల్ని స్థాపించిందని.. దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లుగా పేర్కొన్నారు.

చంద్రబాబు ఎక్కడైనా తప్పు చేస్తారేమోనని తాను చూశానని.. కానీ బాబు ఎక్కడా దొరకలేదన్నారు. ఆయన చెప్పినవన్నీ చేసి చూపించారన్న శివాజీ.. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. జగన్ చేతికి అధికారం వస్తే అమరావతి ఆగిపోతుందని.. పోలవరం ప్రాజెక్టు ముందుకు నడవదన్న మాటను ఆయన చెబుతున్నారు.  తన చేతికి పవర్ వస్తే ఏం చేస్తానన్న విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పటం లేదన్నారు. రాజకీయంగా శివాజీ చేసిన వ్యాఖ్యల్ని కాసేపు పక్కన పెడితే.. ఎన్నికల వేళ పార్టీలకు తగ్గట్లు ప్రజలు మూడు బ్యాచ్ లుగా విడిపోవటం ఏపీకి ఏ మాత్రం మంచిది కాదు. సైద్ధాంతిక విభేదాలు రాజకీయాల్లో మామూలే. కానీ.. వాటిని వ్యక్తిగత స్థాయిల్లోకి తీసుకెళ్లటం ప్రమాదకరమన్న విషయాన్ని మర్చిపోకూడదు.


Tags:    

Similar News